జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు హైద‌రాబాద్‌లోని ఆయా సెగ్మెంట్ల‌లో కాంగ్రెస్ ప‌ర్వాలేద‌న్న రీతిలో బ‌లంగానే కనిపించింది. కానీ దుబ్బాక ఉప ఎన్నిక‌లో బీజేపీ ఘ‌న‌విజ‌యం ఆ పార్టీ శ్రేణుల్లో ఎన‌లేని ఉత్సాహాన్ని నింపింది. దీనికితోడు ఆ పార్టీకి చెందిన అగ్ర నాయ‌క‌త్వం ప్ర‌చారంలో పాల్గొన‌డంతో శ్రేణుల్లో కాన్ఫిడెన్స్ కూడా ఊహించ‌నంత‌గా డెవ‌ల‌ప్ అయింద‌న్న‌ది వాస్త‌వం. జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో త్రిముఖ పోరు ఉంటుంద‌ని అనుకున్నా.. ఎన్నిక‌ల స‌మ‌రంలో కాంగ్రెస్ తేలిపోయింద‌ని ప‌రిణామాల‌ను బ‌ట్టి తెలుస్తోంది. అత్తెస‌రు సీట్ల‌తో స‌ర్దుకుంటుంద‌న్న విశ్లేష‌ణ జ‌రుగుతోంది. కొన్ని మీడియా సంస్థ‌లు అన‌ధికారికంగా ఉటం‌కిస్తూ 10సీట్ల‌కు మించ‌క‌పోవ‌చ్చంటూ వార్త‌ల్లో పేర్కొన్నాయి. అలాగే టీఆర్ ఎస్ 50 నుంచి 70సీట్ల వ‌ర‌కు సాధిస్తుంద‌ని, బీజేపీ 40 నుంచి 48 వ‌ర‌కు సాధిస్తాయ‌ని పేర్కొన్నాయి. ఇదీ కూడా కేటీఆర్ ర‌హ‌స్యంగా ఇద్ద‌రు ఎమ్మెల్సీల‌తో చేయించిన స‌ర్వేగానే ప్ర‌చారం జ‌రుగుతోంది.


ఇదిలా ఉండ‌గా గ్రేట‌ర్ పీఠంపై తీర్పు చెప్పేందుకు ప్ర‌జానీకంగా సిద్ధ‌మయ్యారు. ఇప్ప‌టికే పోలింగ్ ప్రారంభ‌మైంది.  ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.  నగరంలోని 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  గ్రేటర్ మేయర్ పదవిని చెప్పాలి అంటే సంఖ్యాబలం 102 ఉండాలి.  ఈ మ్యాజిక్ ఫిగర్ కోసం తెరాస, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి.  ఎలాగైనా వందకు పైగా స్థానాలు కైవసం చేసుకుంటామని రెండు పార్టీలు చెప్తున్నాయి.  ఓటర్లు ఎవరిపక్షనా నిలుస్తారు అన్నది  అందరిలోనూ ఉత్కంఠతను రేపుతున్నది.  ఎలాగైనా గెలిచి తిరిగి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అధికార టిఆర్ఎస్ పార్టీ చూస్తుంటే, మేయర్ పదవిని కైవసం చేసుకొని హైదరాబాద్ గడ్డపై జెండా ఎగురవేయాలని బీజేపీ చూస్తున్నది.  మరి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే డిసెంబర్ 4 వరకు ఆగాల్సిందే.


మ‌రోవైపు ప‌లు డివిజ‌న్ల‌లో నేత‌ల మ‌ధ్య బాహాబాహి చోటు చేసుకుంటోంది. డ‌బ్బులు పంపిణీ చేస్తున్నార‌ని ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకుంటూ దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. హైదరాబాద్‌ ఛైతన్యపురి డివిజన్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్‌ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. టీఆర్ఎస్‌ శ్రేణులు మధ్యం పంపిణీ చేస్తున్నారంటూ బీజేపీ ఆరోపిస్తోంది. కావాలనే తమపై నిందలు వేస్తున్నారంటూ ఆగ్రహించిన టీఆర్ఎస్‌ కార్యకర్తలు ఛైతన్యపురిలో బీజేపీ కార్యాలయం ముట్టడికి బయల్దేరారు. దీంతో వారిని నివారించే క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: