గ్రేటర్ ఎన్నికలకోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది భారీగా బలగాలను మోహరించారు. ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక వల్లే ఈ స్థాయిలో పోలీసులు తమ బలగాలను మోహరించారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ప్రచార పర్వంలో నేతల మధ్య పేలిన మాటల తూటాలు ఆందోళనకు కారణం అయ్యాయి. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందడం వల్ల మరింత గట్టిగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు హైదరాబాద్ పోలీసులు. ఎన్నికల్లో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి మూడు సార్లు శిక్షణ ఇచ్చారంటే డిపార్ట్ మెంట్ ఎంత పగడ్బందీగా రెడీ అయిందో అర్థం చేసుకోవచ్చు.

సమస్యాత్మక ప్రాంతాలతోపాటు.. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు పలు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అక్రమాలు జరక్కుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సిసిటివి లు ఏర్పాటు చేశారు. జియో  ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ ద్వారా అనుసంధానం చేశారు. జియో ట్యాగింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను అనుసంధానం చేశారు. లక్ష సీసీ కెమెరాల ద్వారా సమస్యాత్మక ప్రాంతాలను మానిటరింగ్ చేస్తున్నారు. ఎన్నికల అనంతరం లైవ్ స్ట్రీమింగ్ ద్వారా స్ట్రాంగ్ రూమ్ వద్ద నిఘా ఉంచేలా ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలనుంచి పోలింగ్ మొదలు కాగా.. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఎలక్షన్ ఏజెంట్ల పేరుతో జరిగే హడావిడికి కూడా బ్రేక్ వేశారు పోలీస్ అధికారులు. ఎలక్షన్ ఏజెంట్‌ కి ప్రత్యేక వాహనానికి కూడా అనుమతి ఇవ్వలేదు. పోలింగ్ కేంద్రాల నుంచి 200 మీటర్ల వరకు ఓటర్లు తమ వాహనాలు తీసుకు రావచ్చు. అక్కడినుంచి మాత్రం కాలినడక తప్పదు. ఓటర్లను ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాల వరకు తరలించడం చట్ట విరుద్ధం అని తేల్చి చెబుతున్నారు పోలీసులు. అలా గుంపులు గుంపులుగా ఓటర్లను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా వాహనాల్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. చివరిగా కొవిడ్ నిబంధనలు కూడా పాటించాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: