గ్రేటర్ ఎన్నికలలో అసలైన యుద్ధం మొదలైంది. పోలింగ్ ప్రారంభమైంది. ప్రముఖులతో పాటు సామాన్యులు పోలింగ్ బూతుల వైపుగా కదులుతున్నారు. నిజానికి గ్రేటర్ ఎన్నికల పట్ల జనాలకు ఎంత ఆసక్తి ఉంది అన్నది ఈ పోలింగ్ సరళి తెలియచేయనుంది. ఉదయాన్నే వచ్చి ఓట్లు వేయడానికి జనాలు పెద్దగా ఇంటెరెస్ట్ చూపించరు. అసలే చలికాలం. దాంతో నెమ్మదిగానే పోలింగ్ మొదలైంది అని చెప్పాలి. ఇక పోలింగ్ కి వచ్చే జనాలను బట్టి కూడా ఫలితాల మీద ఒక అంచనా ఉంటుంది.

ఇక రాజకీయ ప్రముఖులలో చూసుకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీయార్ మొదట్లోనే ఓటు వేశారు. మెల్లగా సినీ ప్రముఖులు. ఇతర రంగాలకు చెందిన వారు వస్తున్నారు. ఈసారి పోలింగ్ మీదనే అందరి చూపూ ఉంది. 2016 లెక్కలను ఒకసారి అందరూ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆనాడు కరోనా లేదు, మరో భయమూ లేదు అయినా సరే పోలింగ్ మాత్రం 45 శాతమే జరగడం విశేషం.

అంటే అప్పట్లొనే ఆసక్తి పెద్దగా లేదని అర్ధమవుతోంది. అయితే దానికి కూడా అనేకమైన  కారణాలు ఉన్నాయని రాజకీయ మేధావులు అంటున్నారు. అప్పట్లో టీయారెస్ మంచి ఊపు మీద ఉండడం అధికారంలోకి వచ్చి ఎక్కువ కాలం కాకపోవడంతో ఒక విధంగా ఏకపక్షంగానే పోలింగ్ జరిగింది అంటున్నారు. దాంతో ఎటూ టీయారెస్ గెలుస్తుంది కదా అన్న ఆలోచనతోనే చాలా మంది పోలింగు బూతుల వైపు చూడడంలేదని అంటున్నారు.

ఈసారి మాత్రం అలా కాదు, గ్రేటర్ ఎన్నికలు మినీ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా మారాయి. అటు టీయారెస్, ఇటు బీజేపీ రెండూ పోటాపోటీగా  దూకుడు చూపించాయి. కాబట్టి అది జనాలను ఎంతలా ప్రభావితం చేసింది అన్నదే చూడాలి. ఈ ప్రచారానికి కనుక జనాలు ఆసక్తి చూపిస్తే కచ్చితంగా బూతుల వద్ద బారులు తీరడం కనిపిస్తుంది. దాని ఫలితంగా ఓటింగు కూడా ఈసారి పెరుగుతుంది. చూడాలి మరి


మరింత సమాచారం తెలుసుకోండి: