గ్రేటర్ ఎన్నికల సమరంలో తులాభారం ఎటు వైపు మొగ్గుతుందా అన్నది ఇపుడు అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. పోటా పోటీగా ప్రచారం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే జాతీయ స్థాయిని కూడా గ్రేటర్ ఎన్నికలు ఆకర్షించాయి. అమిత్ షా లాంటి  వారు రావడం అంటేనే ఈ ఎన్నికల ప్రాముఖ్యత ఏంటో చెప్పకనే చెబుతోంది.

దాంతో ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా వస్తాయి అన్నది అతి పెద్ద చర్చగా ఉంది. అయితే గతసారి కేవలం 45 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడంతో ఈసారి దాని బాగా పెంచాల్సిన అవసరం అయితే కచ్చితంగా ఉంది. గ్రేటర్ లో మొత్తం 80 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కానీ వీరిలో ఉద్యోగ వర్గాలు, మధ్యతరగతి జనాలు, మేధావులు, విద్యావంతులు అసలు పోలింగ్ బూతులకు పోరు.

వారు ఎపుడు ఎన్నికలు జరిగినా కేవలం టీవీలల్లో చూసుకుంటూ అక్కడికే పరిమితం అవుతారు. ఇక ఓట్లు వేసేది కూడా సామాన్యులు. పేదలు, బస్తీ జనాలే, వారి ఓటింగ్ కోసం రెండు పార్టీలూ గట్టిగానే ప్రచారం చేశాయి. కానీ ఓటింగ్ శాతం పెరగాలీ అని కనుక అనుకుంటే మాత్రం పై వర్గాలన్నీ కూడా పోలింగ్ బూతుల వద్దకు వచ్చి క్యూ కట్టాలి.

అయితే కరోనా భయాలు ఉన్నాయి. ఓటు వేస్తే ఏంటి వేయకపోతే ఏంటి అన్నది మధ్యతరగతి, విద్యావంతులకు ఉన్న ఒక చెడ్డ భావన. తమ వంతు కర్తవ్యం తాము నిర్వహించాలని ఈ వర్గాలకు తెలియనిది కాదు కానీ ఓటు వేసేందుకు మాత్రం చొరవ చూపించరు. వారికి బలమైన కారణం ఉంటే తప్ప పోలింగు కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి ఉండరు. అయితే ఈసారి అలాంటి బలమైన కారణాలు వారికి తెలియచెప్పేలా రాజకీయ పార్టీలు ప్రయత్నం చేశాయా అన్నది ఒక ప్రశ్న. అదే కనుక నిజమైతే మాత్రం ఈసారి పోలింగ్ పెర్సెంటేజ్ ఎక్కువగానే ఉంటుంది. మరి చూడాలి ఆ వర్గాలే కనుక రంగంలోకి దూకితే ఫలితం పూర్తిగా మారుతుంది. అసలైన న్యాయ నిర్ణేతలు కూడా వారే అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: