జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చిరంజీవి సహా సినీ ప్రముఖుల్లో చాలామంది ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే సినీ వర్గం ఎవరికి మద్దతిస్తుందనే విషయమే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అందులోనూ మెగా స్టార్ ఎవరికి ఓటు వేశారనే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. ఇటీవలే పలువురు సినీ రంగ ప్రముఖులతో కలసి చిరంజీవి, తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలసి వచ్చారు. హైదరాబాద్ లో కొత్తగా నిర్మించబోతున్న ఫిలింసిటీ ఏర్పాట్లపై చర్చించారు. ఆ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. సినీ రంగానికి చెందిన మరికొందరు వ్యక్తులు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ జీహెచ్ఎంసీ ఎన్నికలకోసం టీఆర్ఎస్ విడుదల చేసిన మేనిఫెస్టోని ఆకాశానికెత్తేశారు. ఈ నేపథ్యంలో చిరంజీవి కూడా టీఆర్ఎస్ కే మద్దతిస్తారని అంటున్నారు.

అదే సమయంలో చిరంజీవి తమ్ముడు, పవన్ కల్యాణ్ జనసేన తరపున బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. అంటే చిరంజీవి తమ్ముడి మాట విని బీజేపీకి ఓటు వేశారా? లేక టీఆర్ఎస్ కి వేశారా అనేది సస్పెన్స్. మెగా ఫ్యామిలీలో చిరంజీవి సంగతి ఎలా ఉన్నా.. నాగబాబు మాత్రం తమ్ముడి మాటే వింటారు. ఆయన కచ్చితంగా బీజేపీకే మద్దతిస్తారని తెలుస్తోంది. ఇక మిగతా సినీ ఇండస్ట్రీ విషయానికొస్తే.. సినీ రంగం నుంచి ఎక్కువ ఓట్లు టీఆర్ఎస్ కే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఓవరాల్ గా సినీరంగం మాత్రం టీఆర్ఎస్ కే మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఎక్కువగా సినీ రంగానికి వరాలు కురిపించారు కాబట్టి. పెద్దలకే కాదు, కార్మికులకు కూడా మేలు చేసే పలు అంశాలు టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్నట్టు సినీ వర్గ ప్రముఖులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉదయాన్నే సినీ రంగ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగతా ప్రజలంతా తమను ఆదర్శంగా తీసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: