ప్రధాన సమస్యలు ఎదురైనప్పుడు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం ఒకప్పటి ఆనవాయితీ. అధికారంలో ఉన్న పార్టీలు ఇటీవలకాలంలో ఈ సంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చేశాయి. అసలు విపక్షాన్ని గుర్తించడంలోనూ ఉదాసీనత ప్రదర్శిస్తున్నాయి. దీనికి భిన్నంగా డిసెంబర్ 4న కరోనాకి సంబంధించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని మోడీ ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా అన్ని పక్షాల అభిప్రాయాలను తెలుసుకోగోరుతున్నారు. వాస్తవానికి ఇలాంటి సమావేశం ఒకటి ఏర్పాటు చేయాల్సిందిగా ఎప్పటినుంచో పలు పార్టీల ప్రతినిధులు విజ్ఞప్తులు చేస్తూ రాగా గతంలో ఓసారి నిర్వహించారు. ప్రస్తుతం జరగబోయేది రెండో సమావేశం.


దేశంలో కరోనా కల్లోలం, సంక్షోభం గురించి మోడీ దృష్టి పెట్టనున్నారు. ఈ మేరకు పార్లమెంట్ లోని ఉభయ సభల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతలు, ఫ్లోర్ లీడర్స్ కి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఆహ్వానాలు పంపించింది. ఈ అఖిల పక్ష సమావేశం వర్చువల్ గా జరుగనుందని సమాచారం. కేంద్ర రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్, హోమ్ మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్ధన్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మెగ్వాల్ హాజరవుతారు. 


ప్రపంచంలో కరోనా ఉదృతి కొనసాగుతున్న దేశాల జాబితాలో 94 లక్షల కేసుల నమోదుతో రెండోస్థానంలోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఉంది. కరోనా వాక్సిన్ అభివృద్ధిలో భాగమైన హైదరాబాద్ లోని భారత్ బయోటెక్, పూణే లోని సీరం ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ ఇండియా, అహ్మదాబాద్ లోని జైడెస్ క్యాడిలా సంస్థలను ప్రధాని ఇటీవల సందర్శించారు. ఆయా సంస్థల్లో కొరోనా వాక్సిన్ పై జరుగుతున్న పరిశోధనల్ని పరిశీలించారు. 


ఈ నేపథ్యంలో వాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి, పంపిణీ, వాక్సినేషన్ అంశాలపై విస్తృతంగా సమావేశంలో చర్చించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2021 మార్చి, ఏప్రిల్ నెలల్లో దేశ ప్రజలందరికీ వాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యాన్ని చేరుకోగలమన్న విషయం కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ మీడియాముఖంగా చెప్పారు. 
కరోనా కాస్త తగ్గుముఖం పట్టిందని తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ తో సహా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళలో యాక్టీవ్ కేసులు భారీగా తగ్గినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: