గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వస్తే ఏ పార్టీ భుజాలు ఎగరవేస్తుంది. మరే పార్టీ తల దించుకుంటుంది అన్నది కూడా ఒక చర్చగా ఉంది. నిజానికి ఈ ఎన్నికల ఫలితాల వల్ల అసెంబ్లీ లో సీట్లు పెరగవు, ముఖ్యమంత్రి కూడా కారు. ఇక పార్లెమెంట్ కి వెళ్ళి ఎంపీ, మినిస్టర్ అయిపోయేది కూడా లేదు.

అయితే ఈ ఎన్నికల వల్ల జనం నాడి తెలుస్తుంది. అది భవిష్యత్తుకు కొంత ఆశగా, నిరాశగా ఎలాగైనా కనిపించే వీలుంది. విషయానికి వస్తే గత సారి ఎన్నికల్లో ఓట్ల పరంగా మూడవ స్థానంలో ఉన్న టీడీపీ ఈసారి 106 డివిజన్లలో అభ్యర్ధులను పెట్టింది. అయినా ప్రచారం లో చంద్రబాబు లోకేష్ అసలు కనిపించలేదు. సాదాసీదాగా టీడీపీ ప్రచారం ముగిసింది. అది పోలింగుని ఎంతవరకూ ప్రభావితం చేసిందో బ్యాలెట్ గుట్టు విప్పితేనే తెలుస్తుంది.

మరో వైపు చూసుకుంటే బీజేపీ గతసారి పెద్దగా సౌండ్ చేయలేదు. ఆ పార్టీకి నాలుగంటే నాలుగు డివిజన్లు గ్రేటర్ లో దక్కాయి. ఈసారి బీజేపీ దూకుడు మమూలుగా లేదుగా. ఆ పార్టీ ఏకంగా మేయర్ పీఠానికే గురి పెట్టింది. మేయర్ పీఠం దక్కాలంటే ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో కలుపుకుంటే 206 సీట్లు అవుతాయి. అందులో సగానికంటే ఎక్కువ అనుకుంటే కచ్చితంగా 104 సీట్లు గెలవాలి.

మరి అది బీజేపీ వల్ల అయ్యే పనేలా. ఎక్కడ నాలుగు సీట్లు, మరెక్కడ 104 అంటే ఈసారి మరో వంద సీట్లు అదనంగా గెలిస్తేనే తప్ప బీజేపీ మేయర్ పీఠం వైపు చూడలేదు. కానీ బీజేపీ టార్గెట్ వేరుగా ఉంది. యాభై డివిజన్లు గెలుచుకుంటే గ్రేటర్ మీద జెండా పాతేసినట్లే అన్నది ఆ పార్టీ ఆలోచన. అలా కనుక చూసుకుంటే బీజేపీ కి నాలుగు కంటే ఎన్ని సీట్లు ఎక్కువ వచ్చినా ప్లస్ అయినట్లే. మరీ బొత్తిగా పది  పన్నెండు  వస్తే నామార్దా కానీ లేకపోతే బీజేపీ హిట్ అయినట్లే.

ఇక టీయారెస్ గత ఎన్నికల్లో 99 సీట్లు గెలుచుకుంది. ఈసారి వంద అంటూ ధంకా భజాయించింది. అందువల్ల ఆ సీట్లు తెచ్చుకోవాలి. కనీసం ఎనభై సీట్లు వచ్చిన ఫరవాలేదు, అలా కాకుండా బొత్తిగా  50 సీట్లు వస్తే మాత్రం ఇజ్జత్ పోయినట్లే. మరి బ్యాలెట్ తీర్పు ఏం చెబుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: