జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ మందకొడిగా కొనసాగుతోంది. క‌రోనా భ‌యాలు.. ఓటు వేయాల‌న్నా ఆస‌క్తి లేక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో పోలింగ్ కేంద్రాల‌కు ఓట‌ర్లు రావ‌డం లేద‌ని తెలుస్తోంది. అనేక పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్లు లేక వెల‌వెల‌బోతున్నాయి. పోలింగ్‌ ప్రారంభమైన తొలి మూడు గంటల్లో నామమాత్రంగా పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు 4.2 శాతం పోలింగ్‌ నమోదైంది. గ్రేటర్ ఎన్నికల్లో ఎప్పుడూ 46 శాతం పోలింగ్ దాటలేదు. అయితే ఓటు వేసేందుకు సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉండటంతో గతంలో కన్నా ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  మంద‌కొడిగా సాగుతున్న పోలింగ్‌తో టీఆర్ ఎస్‌కు మైన‌స్‌గా మారుతుంద‌న్న విశ్లేష‌ణ‌లు వెల్ల‌డవుతున్నాయి. ప‌రోక్షంగా బీజేపీకి లాభించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.


గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 150 డివిజన్ల పరిధిలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 150 డివిజన్లలో మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 38,77,688 మంది పురుషులు, 35,65,896 మంది మహిళలు, 676 మంది ఇతరులు కలిపి మొత్తం 74,44,260 మంది ఓటర్లున్నారు. అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించారు. పోలింగ్ కోసం కోవిడ్ నిబంధనలతో పటిష్ట ఏర్పాట్లు చేశారు అధికారులు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ క్యూలైన్ల ఏర్పాటు.



శానిటైజ్ చేసుకునే ఏర్పాట్లు చేశారు. ఓటర్ ఐడీ కార్డుతో పాటూ.. మాస్క్ కూడా ఉంటేనే పోలింగ్ కు అనుమతి ఇస్తున్నారు. అదేవిధంగా సెల్ ఫోన్ పోలింగ్ వద్దకు అనుమతించడం లేదు. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ పోలింగ్ మందకొడిగా ప్రారంభం అయింది. ఇదిలా ఉండ‌గా  జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నందినగర్ పోలింగ్ బూత్‎లో మంత్రి కేటీఆర్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాచిగూడ పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు ఓటు వేశారు. ఇక బీజేవైఎం ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాస్త్రిపురంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఓటు వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: