ఏదో ఒకటి తేల్చుకుందామనే వచ్చాం. తేలేదాకా వెనక్కి పోం. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల గర్జన ఇది. కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే.. ఢిల్లీకి వచ్చే జాతీయ రహదారులన్నింటినీ దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని మరోసారి చెప్పారు ప్రధాని మోడీ.

దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు మద్దతు పలికితే రాజకీయాలు అంటూ మండి పడింది ఆమ్ఆద్మీ పార్టీ. కేంద్ర ప్రభుత్వం మొండి పట్టు వదిలి పెట్టి.. రైతులతో చర్చించాలని సూచించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. రోజులు గడిచే కొద్దీ ఢిల్లీ చేరుకుంటున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. ఘజియాబాద్ వద్ద ప్రతీ రోజూ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతుల్ని అడ్డుకునేందుకు పోలీసులు నేషనల్ హైవేల మీద పెట్రోలింగ్ పెంచారు. సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించారు. ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం మంకు పట్టు వీడకుంటే ఎన్నాళ్లైనా.. ఢిల్లీ నుంచి వెళ్లేది లేదంటున్నారు రైతు సంఘాల నేతలు

రైతుల లబ్ధి కోసమే కొత్త చట్టాలను తెచ్చామని, రాబోయే రోజుల్లో ఆ ప్రయోజనాలను అన్నదాతలకు అందుతాయన్నారు ప్రధానమంత్రి మోడీ. కొత్త చట్టాలపై విపక్షాలు కావాలనే వదంతులు సృష్టిస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆక్షేపించారు. వారణాసిలోని బహిరంగ సభలో ప్రసంగించిన మోడీ.. వ్యవసాయ చట్టంలో తీసుకొచ్చిన సంస్కరణలతో రైతులకు కొత్త అవకాశాలు రావడంతో పాటు న్యాయపరమైన భద్రత కూడా లభిస్తుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధమని అంటున్నా.. షరతులు పెడుతోంది. ఈ ప్రతిపాదనను రైతులు వ్యతిరేకిస్తున్నారు. షరతులు లేని చర్చలకు తాము అంగీకరిస్తామని భారతీయ కిసాన్ మంచ్ అధ్యక్షుడు బుటా సింగ్ అన్నారు. ఈ తరహా సమావేశానికి కేంద్రం అంగీకరించిట్లు తమకు తెలిసిందన్నారు. రైతుల ఆందోళన తీవ్రం అవుతూ ఉండటంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, హోం మంత్రి అమిత్‌ షాతో రెండోసారి భేటీ అయ్యారు. కేంద్రం సమస్యను పరిష్కరించకుండా జఠిలం చేసేలా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.

రైతులు ఢిల్లీకి భారీ సంఖ్యలో వస్తూ ఉండటం, రోడ్ల మీదనే ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. ఎక్కడా అల్లర్లు జరక్కుండా..పోలీస్ కమిషనర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో స్థానికులే రైతులకు ఆహారం వండి పెడుతున్నారు. రైతుల ఆందోళనలకు మద్దతు పలుకుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: