హోరా హోరీ, బాహాబహి, నువ్వా నేనా? అన్న ఉత్కంఠ తో సాగిన ప్రచారపర్వం ముగిసిన తర్వాత బల్దియా ఇప్పుడు ప్రధానమైన అంకంలోకి జొరబడింది. వోట్ హక్కును వినియోగించుకునే అవకాశం ప్రజల చేతుల్లోకి వచ్చింది. ఉదయం నుంచి మొదలైన ఓటింగ్ నెమ్మది నెమ్మదిగా పుంజుకుంటుంటే వింటర్లో హీట్ కూడా పెరుగుతూ వస్తోంది. అందుకు నిదర్శనంగా పాత  బస్తీలో భారీగా ఓట్ల గల్లంతు, అక్కడక్కడా చిన్నపాటి అల్లర్లు, ఓల్డ్ మలక్ పేట  డివిజన్ 26 లో  పోలింగ్ రద్దు తదితర అంశాలు మినహా   గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓల్డ్ మలక్ పేట  డివిజన్ 26 లో ఓ అభ్యర్థి గుర్తు మారడంతో పోలింగ్ రద్దయింది. ఇక గొడవలు కూడా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి.

అధికార విపక్ష పార్టీలు బల్దియా ఎన్నికలని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా హైదరాబాద్ పేరు మార్మోగుతోంది. అధికార టీఆర్ఎస్ మళ్ళీ గ్రేటర్ పీఠం దక్కించుకుంటామంటుంటే...దుబ్బాక విజయం తర్వాత మాంచి దూకుడు మీద ఉన్న కమలం పార్టీ గులాబీకి ముల్లులా మారింది. త్వరగా గ్రేటర్ ఎన్నికలను నిర్వహించి కాషాయ దళానికి కళ్లెం వేయాలనే ఉద్దేశంతో ఆదరాబాదరాగా ఎన్నికల తేదీ ప్రకటించి మరీ బరిలో సిద్దపడింది. ఉనికిలో ఉందో లేదో తెలీని అయోమయంలో పడ్డ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల బరిలో సత్తా చాటుకునేందుకు ముందుకొచ్చింది. అటు మజ్లీస్ పార్టీ కూడా ఎన్నికల వేడిని రాజేసింది. 

కమల దళానికి నాయకత్వం వహిస్తున్న ఎంపీ బండి సంజయ్ ప్రచార పర్వంలో హీటెక్కించారు. కొన్ని వ్యాఖ్యలు టీఆరెస్, బీజేపీ, మజ్లీస్ మధ్య నిప్పులు పుట్టిస్తే గ్రేటర్ పై కాషాయ జెండా ఎగురవేసేందుకు ఢిల్లీ స్థాయి నేతలు హైదరాబాద్ కి క్యూ కట్టారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మొదలుకుని స్మృతి ఇరానీతో పాటు  కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వరకూ ప్రచారంలో పాల్గొని ఎన్నికల్ని రక్తి కట్టించారు. కేంద్ర హోమ్ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, దుబ్బాక విజేత రఘునందన్ రావు తదితరులు కూడా ప్రచారంలో తీవ్రంగా శ్రమించారు. 

ప్రచారం ముగిసి మైకులు మూగవోయిన తర్వాత ఒకటో తేదీన పోలింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

అయితే, కొన్ని చోట్ల గులాబీ, కమలం పార్టీ కార్యకర్తల మధ్య చెదురుమదురు ఘటనలు తలెత్తగా...చాలా చోట్ల ప్రశాంత వాతావరణం లో ప్రజలు వోట్ హక్కు వినియోగించుకుంటున్నారు. 

ఓటేసిన ప్రముఖులు 

రాజకీయ సినీ ప్రముఖులు వోటేసినవారిలో ఉన్నారు. చిరంజీవి దంపతులు, రాజేంద్ర ప్రసాద్, విజయ్ దేవరకొండ, పరుచూరి గోపాల కృష్ణ...ఇలా చాలామంది వోట్ హక్కు వినియోంచుకోవడమే కాకుండా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తప్పని సరిగా వోట్ వేయాలంటూ సందేశాలు ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  కూడా వోట్ వేశారు. సాఫ్ట్ వెర్ ఉద్యోగులు మాత్రం పోలింగ్ డే ని హాలిడే గా ఎంజాయ్ చేస్తున్నారంటూ విమర్శలు వినవస్తున్నాయి. ఇక... ఫలితాలు ఈనెల 4 న తేలనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: