ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన గ్రేటర్ ఎన్నికలకు టైం వచ్చేసింది. ఉదయం నుంచీ ఓట్లు వేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఇక ఓటరు రావడం ఓటు వేయడం అనే అందరూ భావించారు. ఇక్కడే నాయకులంతా తప్పులో కాలేశారు. ఎందుకంటే గ్రేటర్ ఓటరు పోలింగ్ బూత్‌ వైపు చూడటం లేదు. ఇన్ని రోజులూ పార్టీలు విపరీతంగా చేసిన ప్రచారం మొత్తం వృధా అయిపోయిందనే భావన ప్రస్తుతం నేతల్లో కనిపిస్తోంది. మరీ ఇంత మందకొడిగా ఓటింగ్ ఏంటని వాళ్లు ఆశ్చర్య పోతున్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ మరీ మందకొడిగా జరుగుతోంది. మధ్యాహ్నం అయినా కూడా పట్టుమని 20 శాతం ఓటింగ్ కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఎన్ని పార్టీలు ఎన్నెన్ని సభలు నిర్వహించినా, ఎంత మంది నేతలు ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా.. ఓటర్లు మాత్రం పోలింగ్ బూత్‌లను నిర్లక్ష్యం చేశారు. వారి అడుగులు పోలింగ్ బూత్‌ల వైపు పడటం లేదు. సోషల్ మీడియాలో లెక్చర్లు దంచిన ఐటీ ఉద్యోగులు కూడా ఓటింగ్‌కు దూరంగానే ఉండిపోయారు. ఇక సెలబ్రెటిల్లో కూడా ఇదే పరిస్థితి కనబడుతోంది. అక్కడక్కడ కొందరు తారలు ఓట్లు వేస్తూ కనిపించారు. మితగా వాళ్లు ఎందుకు కనిపించలేదో ఏమో? అటు సామాన్యుల సంగతి అయితే అసలు చెప్పనక్కర్లేదు.

విద్యాధికులు, కార్పొరేట్ ఉద్యోగులు కూడా ఓటింగ్‌కు ఆమడ దూరంగానే నిలిచిపోయారు. ఎన్నికల సందర్భంగా సెలవు దొరికినట్లు ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉండిపోయారు పోలింగ్‌లో ఓట్లు వేయడానికి మాత్రం రాలేదు. ఇలా ఓటింగ్ పెద్దగా నమోదు కాకపోవడంపై విశ్లేషకులు ఆందోళన కనబరుస్తున్నారు. ఓటు వేయకపోవడం ప్రజల బాధ్యతారాహిత్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఓట్లు వేసిన సామాన్యులు కూడా ఓట్లు వేయని వారిని తప్పు బడుతున్నారు. ఓటు వేయనివారికి ప్రభుత్వ, సంక్షేమ పథకాలు రద్దు చేయాలని, అప్పుడే అందరూ ఓట్లు వేస్తారని డిమాండ్లు చేస్తున్నారు. సాయంత్రానికైనా ఓటింగ్ శాతం ముందుకు కదులుతుందేమో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: