దేశంలో క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19) చాప‌కింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. ప‌లు రాష్ట్రాల్లో అయితే, ఆందోళ‌న‌క‌ర స్థాయిలో వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే దేశంలో మ‌రో ద‌శ క‌రోనా వైర‌స్ విజృంభించే అవకాశ‌ముంద‌నే నేప‌థ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మయ్యాయి. ఈ నేప‌థ్యంలోనే దేశంలో క‌రోనా వైర‌స్ మ‌హమ్మారి ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై చ‌ర్చించ‌డానికి ఈ నెల 4న (డిసెంబ‌ర్ 4) అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించ‌డానికి ప్ర‌ధాని మోడీ స‌ర్కారు నిర్ణ‌యించింది.

ఈ స‌మావేశం ప్ర‌ధాని మోడీ నేతృత్వంలో వ‌ర్చువ‌ల్ మోడ్‌లో జ‌ర‌గ‌నున్న‌ది. ఆన్‌లైన్‌లో జ‌రిగే ఈ స‌మావేశంలో పార్ల‌మెంట్ స‌భ్యుల‌తో పాటు అన్ని పార్టీల ఫ్లోర్ లీడ‌ర్లు పాల్గొన‌నున్నారు. పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ఈ అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని స‌మ‌న్వ‌యం చేస్తోంది. దీనికి సంబంధించి ఆ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ఈ నెల 4న జ‌రిగే అఖిల‌ప‌క్ష స‌మావేశానికి సంబంధించి అన్ని పార్టీల‌కు ఇప్ప‌టికే ఆహ్వానాలు పంపించారు. శుక్ర‌వారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంద‌ని తెలిపింది. 

కారోనా నేప‌థ్యంలో అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించ‌డం ఇది రెండో సారి. ఈ స‌మావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా, ఆరోగ్యశాఖ మంత్రి హర్ష్‌వర్ధన్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రులు కూడా హాజ‌రుకానున్న‌ట్టు స‌మాచారం. 

కాగా, దేశంతో క‌రోనా వైర‌స్ బారినప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రి‌త్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 31,118 పాజిటివ్ కేసులు, 482 మ‌ర‌ణాలు న‌మోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 94,62,810కి చేరింది. మొత్తం మ‌ర‌ణాలు 1,37,621కి పెరిగాయి. ఇప్ప‌టివ‌ర‌కూ దేశంలో మొత్తం 88,89,585 మంది కోలుకున్నారు. దీంతో రిక‌వ‌రీ రేటు 93.94 శాతానికి మ‌ర‌ణాల రేటు 1.5 శాతానికి చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: