గ్రేటర్ ఎన్నికల పోరు ముగిసింది. నియోజక వర్గాల్లో పోలింగ్ అత్యంత పేలవంగా సాగింది. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కనిపించిన హోరు.. పోలింగ్ సమయంలో కనిపించ లేదు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ఓటు హక్కు వినియోగించు కోవడంపై దృష్టి పెట్టలేదు. ఈ సారి బల్దియా ఎన్నికలు ఎన్నడూ లేనంత మందకొడిగా సాగాయి. ఇంతలా పోలింగ్ తగ్గిపోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.


గ్రేటర్ ఎన్నికలు నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ‘రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహిచడంలో పూర్తిగా విఫలమయింది. ఎన్నికల కమిషన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. అధికారులు అసమర్థులు కావడం వల్లే ఈ సారి పోలింగ్ ఇంత చెత్తగా నమోదు అయింది. దానికి తోడు గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఇంతగా తగ్గడంలో కేసీఆర్ ప్రభుత్వం పాత్ర కూడా ఉంది. పోలింగ్ తగ్గించేందుకు గులాబీ పార్టీ చాలా కుట్రలు చేసింది. అంతే కాకుండా ఎన్నికల కమిషన్ చేతకాని తనం కూడా ఈ కుట్రలు ఫలించడానికి ఓ కారణం.

ఈ కారణాల వల్లే పోలింగ్ జరగాల్సిన స్థాయిలో జరగలేదు. ఈ సారి ఎన్నికల్లో ప్రభుత్వం చాలా దారుణంగా ప్రవర్తించింది. పోలీసులే ఓటుకు నోటు పంచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు స్వహస్తాలతో డబ్బు పంచి ఓట్లు కొనడంలో పోలీసులే టీఆర్ఎస్‌కు సహాయం చేశారు. గ్రేటర్ ఎన్నికలు మొత్తం ముఖ్య మంత్రి కేసీఆర్ ఎలా జరగాలని భావించారో అలానే జరిగాయి. సీఎం అనుకున్నది సాధించాడు. ప్రభుత్వం చేతిలో ఎన్నికల కమిషన్ బొమ్మలా మారింది. ఈ ఎన్నికల్లో  బీజేపీ ఎన్నికల కమిషన్‌కు పూర్తి సహకారం అందించింది.

ఎన్నికల్లో పోలీసుల తీరు చాలా ఆక్షేపణీయం. చేతకాని డీజీపీపై చర్యలు తీసుకోవాలి’ అని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. కాగా, ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. ఒక్క మలక్ పేటలోనే గుర్తులు తారుమారు కారణంగా పోలింగ్ రద్దయింది. ఇక్కడ డిసెంబరు 3న పోలింగ్ జరుగుతుందని అధికారులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: