దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తే తట్టుకునే పరిస్థితులు లేవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా విలయానికి సంబంధించి చలికాలం సెకండ్ వేవ్ భయాలు పెరగిపోతున్న నేపథ్యంలో మళ్లీ లాక్ డౌన్ తెరమీదికి వచ్చింది.
దేశంలో మొత్తం కేసులు 94.44లక్షలకు, మరణాల సంఖ్య 1.37లక్షలకు చేరిన విషయం విదితమే. సెకండ్ వేవ్ భయాలు, కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ తదితర అంశాలపై కేంద్రం కీలక అడుగులు వేస్తోంది.. దేశంలో కరోనా పరిస్థితులు మారుతుండటంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోందని సమాచారం. 


ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో సెంకండ్ వేవ్ ఉధృతి పెరగడంతో రాబోయే తీవ్రతకు సంకేతమని నిపుణులు హెచ్చరించారు. దీంతో పలు రాష్ట్రాల్లో రాత్రి వేళ కర్ఫ్యూల వంటి నిర్ణయాలను అమలు చేస్తున్నారు.



నియంత్రించడం సమస్యగా మారడంతో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన డిసెంబర్ 4న అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఉభయసభల్లో ప్రాతినిధ్యం వహిస్తోన్న అన్ని పార్టీల పక్షం నేతలతో మోదీ శుక్రవారం భేటీ అవుతారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగనున్న ఈ భేటీలో అందరి అభిప్రాయాలను తెలుసుకుని, ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించనున్నారు.


ఈ భేటీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోం మినిస్టర్‌ అమిత్‌ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తదితరులు హాజరవుతున్నారు. ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని పార్టీ నాయకులను సంప్రదించినట్లు సమాచారం. ఈ సమావేశం జరుగుతున్న విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధించబోతున్నారనే ప్రచారం గుప్పుమంది. మళ్లీ లాక్ డౌన్ విధిస్తే దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని, ప్రజల్లో అల్లకల్లోలం మొదలవుతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: