హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం దారుణంగా పడిపోయింది. ఇంత తక్కువ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవడం భాగ్యనగర చరిత్రలో ఇదే తొలిసారి. కరోనా భయం వల్లనో, ఓటు వేసేందుకు అనాసక్తో తెలియదు గానీ జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఓటర్లు ఆసక్తి చూపలేదు. దీంతో అనేక చోట్ల పోలింగ్ బూత్‌లు ఖాళీగా దర్శనమిచ్చాయి. మొత్తంగా నేటి ఎన్నికల్లో 40 శాతం పోలింగ్ కూడా నమోదు కాలేదు. ఇంత తక్కువ స్థాయిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం నమోదవడం రాజకీయ పార్టీల్లో ఆందోళన కలిగిస్తోంది.   

పోలింగ్ తక్కువ నమోదవడానికి కారణాలేంటంటే..
చదువుకున్న వారు పోలింగ్ కేంద్రాల దరిదాపులకు కూడా రాలేదు. ఓటు వేయాల్సింది పోయి ఈ రోజు సెలవు దినంగా ఎంజాయ్ చేస్తున్నారు. కార్పొరెట్ ఉద్యోగులు ఎంజాయ్ చేస్తున్నారు. ఓటు వేయకపోవడం బాధ్యతారాహిత్యమేనంటూ మరికొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది 400 ఏళ్ల చరిత్రగల హైదరాబాద్‌కు సిగ్గుచేటుగా అభివర్ణిస్తున్నారు.     

సోషల్ మీడియాలో కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. ‘మాకు అవి కావాలి.. ఇవి కావాలి.. అంటూ అందరూ డిమాండ్‌లు చేస్తారు. ఆ నేత సరిగా పని చేయడం లేదు. ఈ నాయకుడు అవినీతి చేస్తున్నాడు అంటూ హల్‌చల్ చేస్తారు. కానీ ఓటు వేసేందుకు మాత్రం ఎందుకని ముందుకు రారు? అంటూ హైదరబాదీలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. క్యూ లైన్లు ఉన్నప్పటికీ ఓపికతో ఓటు హక్కును వినియోగించుకుంటున్న వికలాంగులు, వయోవృద్ధులనైనా ఆదర్శంగా తీసుకోవాలని, వారిని చూసైనా సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలుకుతున్నారు.     

అయితే.. గతంలోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో అనేకసార్లు అతి తక్కువ పోలింగ్ నమోదైంది.
ఆ సందర్భాలివే..   
2009 జీహెచ్ఎంసీ ఎన్నికలో 42.04 శాతం.
2016లో 45.29 శాతం పోలింగ్.
2009 సార్వత్రిక ఎన్నికల్లో 58 శాతం పోలింగ్.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో 50.86 శాతం పోలింగ్.
2019 లోక్‌సభ ఎన్నికల్లో 39.46 శాతం పోలింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: