గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు ఓటింగ్‌కు దూరం జరిగారు. దాదాపు 70లక్షలమంది ఓటర్లున్న నగరంలో ఓటు వేసింది కేవలం 35 శాతం మాత్రమే. గతంతో పోల్చినా.. ఇది చాలా తక్కువ. జనరల్ ఎలక్షన్, అసెంబ్లీ, మున్సిపాలిటీలు,  కార్పోరేషన్లు...ఎన్నికలు ఏవైనా సరే.. ఒకేలా ఉంటోంది నగర ఓటర్ల తీరు. ఈ సారైనా.. అనుకున్న వాళ్ల ఆశల్ని తునాతునకలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోటెత్తుతుంటే.. నగరాలు, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఉన్నత చదువులు చదువుకున్న వాళ్లు, సంపన్నులు, సెలబ్రిటీలు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, సోషల్ మీడియాలో వీరోచిత రాతలు రాసేవాళ్లు.. ఉన్నత వర్గాల ప్రజలు నివశించే ప్రాంతాల్లోనే ఓటింగ్ తగ్గుతున్న తీరు ప్రజాస్వామ్య వాదులని ఆందోళనలో పడేస్తోంది.

ఓటు హక్కు ఊరికే రాలేదు. పోరాడితే వచ్చింది. కొన్ని దేశాల్లో ఓటు హక్కు కోసం ఇప్పటికీ పోరాటాలు జరుగుతున్నాయి. ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే, ఓటు వేసే అవకాశం రాకపోతే.. తాము చనిపోయినట్లే అని భావించే వాళ్లు మన దేశంలో ఉన్నారు. ఓటు హక్కు ఉన్నవారంతా ఓటు వేయాలని ఎన్నికల కమిషన్ ఎన్ని ఏర్పాట్లు చేస్తుందో తెలుసా. బ్యాలెట్ పేపర్లు, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల కమిషనర్లు, పోలింగ్ బూత్‌ల దగ్గర భద్రత కల్పించే పోలీసులు.. వీళ్లంతా ఎవరి కోసం..ఓటర్ల కోసమే. మనం కట్టిన పన్నుల్లో నుంచి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహిస్తోంది.

నగరాల్లో ఓటింగ్ శాతం తగ్గడంలో  ఓటర్లతో పాటు పార్టీలు, నాయకులకీ బాధ్యత ఉంది. ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల యుద్ధాలు, పరస్పర ఆరోపణలు, దూషణభూషణలు, తిట్ల దండకాలు, పోలింగ్ ముందు రోజు ప్రలోభాలు, పోలింగ్ రోజు గొడవలు లాంటి అనేక అంశాలు విద్యాధికుల్లో ఎన్నికలంటేనే విరక్తి కలిగేలా చేస్తున్నాయి. అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గడం కేవలం హైదరాబాద్‌లోనే కాదు.. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. ఓటింగ్‌ పెంచేందుకు ఎన్నికల కమిషన్, స్వచ్చంధ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా తయారయ్యాయి. ఓటింగ్ శాతం ప్రతీసారి ఆందోళనకరమైన రీతిలో తగ్గుతోంది. ఇలాంటి పరిస్థితి ప్రజాస్వామ్యానికి హానికరం. 

మరింత సమాచారం తెలుసుకోండి: