జాంబాగ్‌ డివిజన్‌లో ఆగాపురాలో మజ్లిస్‌ పార్టీ రిగ్గింక్‌కు పాల్పడుతోందని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎం.ఆనంద్‌కుమార్‌ గౌడ్‌ను మజ్లిస్‌ నాయకులను అడ్డుకోబోయారు. దీంతో మజ్లిస్‌ నేతలు మీర్జా రహ్మాత్‌బేగ్, ఆనంద్‌కుమార్‌ గౌడ్‌ల మధ్య వాగ్వివాదం నెలకొంది. మజ్లిస్‌నేతలు ఆనంద్‌కుమార్‌ గౌడ్‌పై దాడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇరువురికి నచ్చజెప్పి సమస్యను సద్దుమణిగించారు. పెద్ద ఎత్తున రిగ్గింగ్‌ చేసేందుకు మజ్లిస్‌ నేతలు జూబ్లీస్కూల్‌ పోలింగ్‌ బూత్‌కు వచ్చారని ఆనంద్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. ఆగాపురా ప్రాంతంలో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌ సమయం సాయంత్రం 6 గంటలు కావడంతో పోలీసులు పోలింగ్‌ కేంద్రాలకు తాళాలు వేయించారు. ఆగాపురాలోని పోలింగ్‌ బూత్‌లలో ఎవరు ఓటర్లు లేకపోవడంతో సాయంత్రం 6 గంటలకు తాళాలు వేసి పోలింగ్‌ కేంద్రాన్ని ఎన్నికల అధికారులు మూసివేశారు.

జియాగూడ డివిజన్‌లో సుమారు 51 పోలింగ్‌స్టేషన్లు ఉన్నాయి. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు చోట్ల ఓట్లు గల్లంతయ్యాయని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. కొన్ని బస్తీల్లో పూర్తిగా ఓటరు జాబితాలో తమ పేర్లు లేవని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. నవోదయనగర్‌లోని 38వ బూత్‌లో సుమారు 700 ఓటర్లలో 300 మాత్రమే ఓటరు జాబితాలో ఉండగా మిగిలన ఓట్లు గల్లంతయ్యాయి.

వాల్మీకినగర్‌ బస్తీలో 1800 ఓట్లు పూర్తిగా గల్లంతయ్యాయని స్థానికులు తెలిపారు. 2 రోజులు ముందుగానే ఓటరు జాబితాలను జీహెచ్‌ఎంసీ ఇవ్వాల్సి ఉండగా.. ఒక్కరోజు ముందు రాత్రి ఇవ్వడంతో ఇబ్బందుల తలెత్తాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్గానగర్, సాయిదుర్గానగర్‌ ఓటరు జాబితాలో 550 మంది ఓటర్ల పేర్లు కనిపించలేదు. దీంతో పలు చోట్ల ఓటింగ్‌శాతం తగ్గింది.

గోషామహల్‌ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. బేగంబజార్, గోషామహల్, దత్తాత్రేయనగర్, గన్‌ఫౌండ్రీ, జాంబాగ్, మంగళ్‌హాట్‌ డివిజన్లలోని 329 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తి చూపలేదు. ఉదయం 10 గంటలకు కూడా పలు పోలింగ్‌ కేంద్రాల్లో 10 శాతం పోలింగ్‌ కూడా నమోదు కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: