హైదరాబాద్ లో వరద సాయం అందనివారు ఇటీవల రోడ్లెక్కారు. మీసేవా కౌంటర్ల ముందు బారులు తీరారు. ఉదయం ఆరు గంటలకంటే ముందు నుంచీ క్యూలైన్లలో ఉన్నారు. పిల్లా పాపల్ని ఇంట్లో వదిలేసి అర్థరాత్రి నుంచి కునికి పాట్లు పడుతూ క్యూలైన్లోకి వచ్చారు. డబ్బులొస్తున్నాయంటే అలా పడిగాపులు కాసిన జనాలు.. ఓట్లు వేయండి అంటే మాత్రం వెనకడుగేశారు. కనీసం ఉదయం ఏడుగంటలకి కూడా రోడ్లపైకి రాలేదు. అందుకే గ్రేటర్ లో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోయింది.

వరదసాయం కోసం మీ సేవా కౌంటర్ల ముందు బారులు తీరిన జనం వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా పాపురల్ అయ్యాయి. ఆడ, మగ, పేద, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు వరదసాయం కోసం బ్యాంక్ పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు పట్టుకుని మీసేవా కౌంటర్ల ముందు బారులు తీరారు. అలాంటి వారంతా పోలింగ్ రోజు ఎక్కడికి పోయారు. ఏ పార్టీ గెలిచినా మాకు రావాల్సింది మాకు వస్తుందనే ధీమా వారిలో ఉందా? లేక ఎవరు గెలిచినా మా తలరాతలింతే అనే వైరాగ్యంలో ఉన్నారా? ఏదేమైనా జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్లు మాత్రం ఈ దఫా పరిణతి ప్రదర్శించలేకపోయారు. కనీసం ఓటు వేయడానికి కూడా బైటకు రాకుండా, ఓటు హక్కుని కాలదన్నుకున్నారు.

సోషల్ మీడియాలో జీహెచ్ఎంసీ ఓటర్లపై సెటైర్లు ఓ రేంజ్ లో పేలుతున్నాయి. ప్రశ్నించడానికి లేచే గొంతులన్నీ.. ఓట్లు వేయండి అంటే మాత్రం వెనక్కు తగ్గుతున్నాయని, ర్యాలీలలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించిన కార్యకర్తలంతా పోలింగ్ బూత్ లకు రావాలంటే బద్దకిస్తున్నారని కామెంట్లు పడుతున్నాయి. కొత్త కొత్త మీమ్స్ తో గ్రేటర్ ఓటర్లపై సెటైర్లు వేస్తున్నారు. అయితే ఇదంతా దేనికి సంకేతం అనేదే ఇప్పుడు విశ్లేషించుకోవాల్సిన అంశం. ప్రజలంతా ఓటింగ్ ని బహిష్కరిస్తున్నారంటే ఏ పార్టీపైనా వారికి నమ్మకం లేదనే లెక్క. కనీసం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ బతుకులింతే అనే నైరాశ్యంతోనే వారంతా ఓటింగ్ కి దూరంగా ఉంటున్నారనుకోవాలి. కచ్చితంగా దీనిపై విశ్లేషణ సాగాలి, ప్రజల్లో పార్టీలన్నీ నమ్మకం పెంచే దిశగా ఆలోచించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: