బీజేపీ దూకుడు మామూలుగా లేదు. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చి పాగా వేయాలన్నది ఆరాటం. దానికి తగినట్లుగా దుబ్బాక ఉప ఎన్నికలో బోణీ కొట్టింది. ఇక గ్రేటర్ ఎన్నికల్లో ఆ జోరు కొనసాగించాలనుకుంది. అయితే గ్రేటర్ ఎన్నికల్లో అంతా బాగానే ఉన్నా కూడా పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడమే ఇపుడు చికాకు పెడుతున్న అంశంగా ఉంది.

పోలింగ్ ఎంత పెరిగితే అంత విపక్షాలకు అడ్వాంటేజ్ అవుతుంది. కానీ ఇపుడు సీన్ చూస్తే వేరుగా ఉంది. దాంతో బీజేపీలో తర్జన భర్జన జరుగుతోంది. గెలిచి తీరుతామని ఢంకా భజాయించిన పార్టీ ఇపుడు టీయారెస్ మీద కత్తులు నూరుతోంది. పోలింగ్ కి రాకుండా జనాలను ఆపు చేయించారంటోంది. జనాలకు భయపెట్టేశారని కూడా విమర్శలు చేస్తోంది. పోలింగ్ తక్కువ జరగడానికి కారణమైన టీయారెస్ తల దించుకోవాలని కూడా అంటోంది.

సరే ఎన్ని అనుకున్నా జరిగింది జరిగిపోయింది. ఇపుడు బీజేపీ కి విజయావకాశాలు ఏమేరకు ఉన్నాయి అన్నది కనుక చూసుకుంటే గతంలో చెప్పుకున్నట్లుగా పెద్ద ఎత్తున అనుకూల వాతావరణం ఉండేది లేదు అన్న మాట వినిపిస్తోంది. జనాలు బయటకు వచ్చి ఓటు వేయకపోవడం బీజేపీకి ఇబ్బందికరమైన అంశం అంటున్నారు.

ఇక చూసుకుంటే చదువరులు, మధ్యతరగతి వర్గాల్లో ఎక్కువగా బీజేపీకి పట్టు ఉంది. కానీ వారెవరూ ఓటింగుకు రాకపోవడం మైనస్ గా ఉంది. శివారు ప్రాంతాలో బస్తీలో ఓటింగ్ బాగా జరగడం అంటే అది కచ్చితంగా టీయారెస్ కి లాభం అవుతుంది అని విశ్లేషిస్తున్నారు. ఈ నేపధ్యంలో బీజేపీకి ఇంత ప్రచారం చేస్తే గతంలో కంటే ఎక్కువగా ఓట్లు పెరుగుతాయి కానీ సీట్లు మాత్రం అంతకు తగినట్లుగా రావని అంటున్నారు. మరి బ్యాలెట్ బాక్సులను విప్పి లెక్కబెడితే అసలు కధ ఏంటో తెలుస్తుంది. ఏది ఏమైనా కమలవికాశానికి గ్రేటర్ ఎన్నికలు గేట్ వే అవుతాయా లేదా అన్నది కూడా కొద్ది గంటల్లోనే తేలిపోనుంది అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: