గ్రేటర్ ఎన్నికలు దాదాపుగా ముగిశాయి. కేవలం మలక్ పేట నియోజక వర్గంలో మాత్రమే ఈ నెల 3న ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఎన్నికల నుంచి కరోనా మహమ్మారిపై దృష్టి పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు. జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రచారం చేస్తూ ప్రజల్లో తిరిగిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కనీసం ఓ వారం రోజులపాటు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఈ మేరకు పబ్లిక్ హెల్త్ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు సూచించారు. కరోనా సోకిందనే అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దేశంలో కొన్ని రాష్ర్టాల్లో ఇప్పటికే కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చేసిందని, ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ సెకండ్‌ వేవ్‌ కారకులు కాకూడదని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తమ్మీద 55లక్షల 51వేల 620 కరోనా పరీక్షలు చేశామని ఆయన వెల్లడించారు. వీటిలో 2,70,883 మందికి పాజిటివ్‌ ఫలితం వచ్చిందని వివరించారు.

ప్రతి పదిలక్షల మందిలో 1 లక్ష 49 వేల156 మందికి కరోనా టెస్టులు చేశామని డాక్టర్ శ్రీనివాస్‌రావు చెప్పారు. పాజిటివ్‌ రేట్‌ 23 శాతం నుంచి 1.1 శాతానికి తగ్గిందని వెల్లడించారు. సెప్టెంబరులో 16 లక్షల 26 వేల 598 పరీక్షలు చేయగా 65 వేల 903 పాజిటివ్‌ కేసులు తేలాయని తెలియజేశారు. ఆ సమయంలో 4.05 శాతం పాజిటివ్‌ రేట్‌ నమోదైందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,266 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, యాక్టివ్‌ కేసుల రేషియో తెలంగాణలో 3.4 శాతం ఉందని అన్నారు.

ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా చూసుకుంటే పాజిటివ్ కేసుల నిష్పత్తి 4.5 శాతం ఉందని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి కరోనా మహమ్మారి అదుపులోనే ఉందని, ఈ పరిస్థితి చేయి దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: