జీహెచ్‌ఎంసి ఎన్నికలు ముగిశాయి. ఉదయం అంతా మందకొడిగా సాగిన పోలింగ్.. చివరి గంటలో అనూహ్యంగా పుంజుకుంది. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగినట్లు తేలింది. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఉంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన కాంగ్రెస్, ఉనికి కోసం కష్టపడుతున్న టీడీపీ కూడా ఈ ఎన్నికలపై చాలా ఆశలు పెట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ కౌంటింగ్ పైనే నిలిచింది. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు జరగబోతోంది.

ఈ క్రమంలో ఈ లెక్కింపును పర్యవేక్షించే అధికారులు అంటే కౌంటింగ్ అబ్జర్వర్లను నియమిస్తున్నట్లు తెలంగాణ ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు సంబంధించి ఈ నెల 4నే ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల నుంచి 31 మందిని అబ్జర్వర్లుగా నియమిస్తూ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి అశోక్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఓట్ల లెక్కింపును పర్యవేక్షించే అధికారులు ఆయా వార్డులు, సర్కిల్‌ కార్యాలయాల్లో లెక్కింపు ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలిస్తారని పేర్కొన్నారు.

వీళ్లందరూ ఎన్నికల కమిషన్‌ ప్రతినిధులుగా ఓటింగ్‌ జరిగే ప్రదేశాల్లో పనిచేస్తారు. లెక్కింపు ప్రక్రియలో క్రమశిక్షణ పాటించడం, ఈ సమయంలో గొడవలు కాకుండా నియంత్రించడం వంటివి వీరి బాధ్యతలు. ఓట్ల లెక్కింపు పర్యవేక్షకులుగా బాధ్యతలు చేపట్టనున్న అధికారులతో గురువారం ఉదయం 11గంటలకు ఎన్నికల కమిషనర్‌ పార్థ సారధి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని సమాచారం. ఈ చర్చలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాఫీగా జరిగడంలో అబ్జర్వర్ల విధులు, బాధ్యతలకు సంబంధించి అంశాలను వివరిస్తారని తెలుస్తోంది.

అయితే పోలింగ్‌లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తున్న కొన్ని పార్టీలు కౌంటింగ్ సమయంలో ఎలా ప్రవర్తిస్తాయనే విషయం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. కౌంటింగ్ సమయంలో భద్రత చాలా గట్టిగా ఉండబోతోందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: