హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిన్నటితో ముగిశాయి. రెండు రోజులు ముందుగా 29వ తేదీతోనే ప్రచార కార్యక్రమాలూ నిలిచిపోయాయి. అయితే ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు, వందల మంది కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి తమ పార్టీలకు మద్దతుగా కార్యక్రమాలు నిర్వహించారు. ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలూ నిర్వహించారు. అయితే కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో ఇంతమంది ప్రజలు రోడ్లపై తిరగడంపై పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇంతమంది రోడ్లపై తిరగడం వల్ల కరోనా ఉధృతి పెరిగే అవకాశం ఉందని, అందువల్ల అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

దీనికి సంబంధించి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పాల్గొన్న వారంతా ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కనీసం వారం రోజులపాటు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని కోరారు. అంతేకాకుండా ఎవరిలోనైనా కొవిడ్ లక్షణాలు కనిపించినా, లేక కొవిడ్ లక్షణాలున్నాయేమోననే అనుమానం కలిగినా వెంటనే కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఏ మాత్రం అశ్రద్ధ చేయొద్దని కోరారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, మాస్క్‌ 90శాతం రక్షణ కల్పిస్తుందని, అనుక్షణం పరిశుభ్రంగా ఉంటూ భౌతిక దూరం పాటించాలని, తద్వారా కోవిడ్‌ ముప్పు నుంచి రక్షణ పొందవచ్చని సూచించారు.


‘రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులో ఉంది. అయినా ఒక పక్క చలి తీవ్రత పెరిగింది. మరో పక్క జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. పెద్ద మొత్తంలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ వారం రోజుల పాటు ఐసొలేషన్‌లో ఉండండి. తెలియకుండా సెకండ్‌వేవ్‌కు కారణం కావద్దు. మనతో పాటు ఇతరులనూ బాధితులను చేయొద్దు’ అంటూ డాక్టర్ శ్రీనివాస్ ప్రజలను అభ్యర్థించారు.


దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనా సెకండ్‌వేవ్‌ వ్యాపిస్తోందని, రాష్ట్రంలో ఎవరూ సెకండ్‌వేవ్‌‌‌కు కారకులు కావద్దని డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇదిలా ఉంటే కరోనా మొదలైనప్పటి నుంచీ ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్రంలో 55,51,620 మందికి కొవిడ్ పరీక్షలు చేశామని, అందులో 2,70,883 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రతి 10లక్షల మందిలో 1,49,156 మందికి పరీక్షలు నిర్వహించామన్నారు. పాజిటివ్‌ రేటు 23శాతం నుంచి 1.1 శాతానికి తగ్గిందని తెలిపారు. సెప్టెంబర్‌లో 16,26,598 పరీక్షలు చేయగా 65,903 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని చెప్పారు. 4.05 శాతం పాజిటివ్‌ రేటు నమోదైందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,266 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, యాక్టివ్‌ కేసుల నిష్పత్తి తెలంగాణలో 3.4 శాతం ఉండగా.. దేశంలో 4.5 శాతం ఉందని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: