జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం కు తాము మద్దతు పలుకుతున్నాము అని, అసలు రాజధాని అంశంలో తాము జోక్యం చేసుకోమని గొప్పగా చెప్పిన బిజెపి ఇప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు మాదిరిగా పూర్తిగా తమ నిర్ణయం మార్చుకుని యూటర్న్ పాలిటిక్స్  కు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా అమరావతి లోనే ఏపీ రాజధాని ఉండాలి అంటూ  ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటన చేయడం ఆసక్తి కలిగిస్తోంది. రాజధానిగా అమరావతి కి బిజెపి మద్దతు పలుకుతోందని ఆయన క్లారిటీ గా చెప్పారు.




 ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మూడు రాజధానుల ఏర్పాటుకి నిర్ణయం తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. మొదట్లో ఈ ప్రతిపాదనను టిడిపి వ్యతిరేకించగా, దానికి జనసేన కూడా వంత పాడింది . అప్పట్లో ఈ రెండు పార్టీల నిర్ణయానికి బిజెపి వ్యతిరేకంగా గళం వినిపించినా, ఇప్పుడు మాత్రం ఆ రూట్ నే ఫాలో  అవుతుండటం ఆసక్తికరంగా మారింది. కేవలం అమరావతి వ్యవహారమే కాకుండా, వివిధ సమస్యల పైన పోరాటం చేసేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. త్వరలోనే బిజెపి కేంద్ర కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేయబోతున్నాం అని వీర్రాజు ప్రకటించారు. 



గత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ని అప్పులు పాలు చేశాయని మండిపడ్డారు. 30 లక్షల ఇళ్లను పేదలకు ఇస్తున్నాము అని జగన్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. వాటిలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని, 15 లక్షల ఇళ్లను కేంద్రం ఇస్తోందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని బిజెపి శ్రేణులకు వీర్రాజు పిలుపునిచ్చారు. అంతేకాకుండా రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పైన తాము పోరాడుతామని ప్రకటించారు. ఈ నెల 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల దుస్థితి పై ఆందోళన చేపడతామని, వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేసేందుకు ఎటువంటి మొహమాటం పడము అన్నట్లుగా వీర్రాజు తేల్చిచెప్పారు. ప్రస్తుతం రైతులకు న్యాయం చేయాలి అంటూ  పవన్ జిల్లాల పర్యటన చేస్తూ, ప్రజలను పట్టు సాధించుకునే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఇదే రూట్ లో బిజెపి కూడా వెళుతుండటం, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పైచేయి సాధించేందుకే అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: