రాజకీయ సంచలనం సృష్టించేందుకు నిర్ణయించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుగా అనుకున్నట్లు గానే జిల్లాల యాత్రకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా రైతుల ఇబ్బందులపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు సిద్ధమైపోయారు. తాజాగా కృష్ణా జిల్లాలో పర్యటించిన పవన్ చిత్తూరు, నెల్లూరు ప్రకాశం జిల్లాలోనూ పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తుఫాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో విఫలమైందని, పవన్ కృష్ణా జిల్లా యాత్రలో విమర్శలు చేశారు. పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరు కావడం కాస్త  పవన్ పర్యటనలో ఊపు తెచ్చింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు వైసీపీలో కలకలం రేపాయి.




 పవన్ పర్యటన మామూలుగా జరిగితే పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదు. కానీ బుధవారం జరిగిన కృష్ణాజిల్లా యాత్రలో మాజీ ఎంపీ కేపీ రెడ్డియ్య యాదవ్ పవన్ తో సమావేశం కావడం, ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శలు చేయడం,  రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను, తుఫాన్ పరిహారం విషయంలో వ్యవహరిస్తున్న తీరు ,అంచనాలతో సరిపెట్టి ఆదుకోని వైనం ఇలా అన్నిటినీ  చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కూడా రైతులను ఆదుకునేందుకు ఏం చేయాలి అనే విషయం పైన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే  పెద్దగా యాక్టివ్.గా లేని మాజీ ఎంపీ ఈ సమావేశం లో పాల్గొనడం పెద్ద దుమారం రేపుతోంది.సదరు మాజీ ఎంపీ మామూలు వ్యక్తి అయితే పెద్ద చర్చ ఉండేది కాదు.



 కానీ పవన్ ను కలిసిన మాజీ ఎంపీ రెడ్డి య్య యాదవ్ వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పార్థసారథి తండ్రి. ఆయన వారసుడిగా నే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పార్థసారధి రాజకీయంగా కీలక పదవులు అనుభవించినా, ప్రస్తుత వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎప్పటి నుంచో ఆయనకు మంత్రి పదవి వస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఇటీవల రెండు బిసి మంత్రి పదవులను జగన్ భర్తీ చేసే సమయంలోనూ పార్థసారథి పేరు వినిపించినా , జగన్ ఆయనకు పదవిని కేటాయించలేదు. అయితే అకస్మాత్తుగా పవన్ టూర్ లో పార్థసారధి తండ్రి పాల్గొనడం, వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడం సంచలనంగా మారింది. అసలు వైసీపీలో ఎమ్మెల్యే గా ఉన్న  తన కుమారుడికి తెలియకుండానే రెడ్డియ్య పవన్ ను కలిశారా అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారడం తో పాటు, ఇప్పుడు పార్థసారథి వ్యవహారం పైనా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: