తీర్పు అంటేనే ఏదో భయం. మార్పు కోసమేనని మరింత భయం. అన్నీ కలసి జనం ఇచ్చే తీర్పు కఠినమని ఇంకో అనుమానం. మొత్తం మీద చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటర్ దేవుడు ఎవరిని కరుణించాడో తెలియక రాజకీయ పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. ఓటేసిన ఆసామికి కోటి దండాలు పెట్టుకుంటూనే ఆ ఓటు తమకే పడాలని శతకోటి వందనాలు దేవుళ్లకు పెట్టుకుంటున్నాయి.

మరి కొద్ది గంటల్లో గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి అనగానే అన్ని రాజకీయ పక్షాల్లో ఏదో తెలియని గుబులు ఆవహిస్తోంది. ఈసారి ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. అది రికార్డు అనుకుంటే మొద్దు నిద్ర వీడని  గ్రేటర్ జనం పోలింగునకు రాలేదు. దాంతో అసలైన షాక్ అలా తగిలింది. ఇక ఇంకో వైపు చూసుకుంటే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు కనుక తేడా కొడితే ఏంటన్న టెన్షన్ కూడా రాజకీయ పార్టీలకు ఉంది.

ఈ ఎన్నికలో చూసుకుంటే టీయారెస్ కే ఫలితాలు చాలా ముఖ్యమని చెప్పాలి. గతంలో 99 సీట్లు వచ్చిన టీయారెస్ కి ఒక్క సీటు తగ్గినా తీవ్ర వ్యతిరేకత అని విపక్షం చెలరేగి మరీ ప్రచారం చేసే అవకాశం ఉంది. అంతే కాదు, రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఖాయమని ఊరూరా  తిరిగి మరీ దండోరా వేసే అవకాశం ఉంది.

దాంతో గులాబీ పార్టీకి ఫలితాలు వచ్చేంతవరకూ కూడా యమ టెన్షన్ గా ఉందిట. ఇక మరో వైపు చూసుకుంటే బీజేపీ కి కూడా అగ్ని పరీక్షగానే ఈ ఫలితాలను చూడాలని అంటున్నారు. గత ఎన్నికల్లో నాలుగంటే నాలుగు డివిజన్లు గెలిచిన బీజేపీ ఈసారి డబుల్  డిజిట్ గెలుచుకోకపోతే ఇజ్జత్ పోవడం ఖాయమని చెప్పకతప్పదు, అంతే కాదు, జాతీయ నాయకులు వచ్చి ప్రచారం చేసిన కమల వికాసం జరగలేదంటే మరింత నిరాశ మూటకట్టుకోక తప్పదని అంటున్నారు.

ఇక కాంగ్రెస్ పరిస్థితి చూసుకుంటే బలమైన  పునాది ఉందని భావిస్తున్నా గ్రేటర్ లో తేడా కొడితే మాత్రం ప్రధాన ప్రతిపక్షం నుంచి కూడా ఇంకా దిగువకు జారే అవకాశాలు ఉన్నాయని ఆందోళన‌ ఉంది. టీడీపీకి ఈ ఎన్నికలో  ఒక్క సీటు దక్కినా ఓకే. ఎందుకంటే గత‌సారి చినబాబు లోకేష్ ప్రచారం చేసినా అదే దక్కింది. కానీ ఆ సీటూ రాకపోతే మాత్రం టీడీపీ దుకాణం సర్దేయాల్సిందే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: