గ్రేటర్ ఎన్నికల ఫలితాలు మరి కొద్ది గంటల్లో వస్తున్నాయి. తినబోతు రుచి ఎందుకు అన్న సామెత ఉన్నా కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా ఆరాటం సహజం. ఇక బీజేపీ గ్రేటర్ ఎన్నికల్లో చాలా కష్టపడింది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని రిపీట్ చేయాలని కూడా ఆశపడుతోంది. గ్రేటర్ లో పాగా వేస్తే తరువాత  రాజకీయ కధను  తెలంగాణాలో మలుపు తిప్పవచ్చునని బీజేపీ పెద్ద ప్లాన్ తోనే బరిలోకి దిగింది.

మరి బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులు, పెద్ద నాయకులు ఢిల్లీ నుంచి దిగి మరీ ప్రచారం చేశారు. వారూ వీరు అని కాకుండా మొత్తానికి మొత్తం కమలదళం హైదరాబాద్ మీద పెద్ద ఎత్తున  పడిపోయింది. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ టూర్ పెట్టుకోవడం వెనక కూడా కచ్చితమైన ప్లాన్ ఉందని అంటారు.

ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా చివరి రోజు ఎన్నికల ప్రచారానికి వచ్చి లాస్ట్ పంచ్ ఇచ్చారు. ఇక కిషన్ రెడ్డి బండి సంజయ్ అయితే తామే పోటీ చేస్తున్నట్లుగా ఫీల్ అయి గల్లీ గల్లీ తిరిగారు. ఇంతలా కష్టపడిన తరువాత బీజేపీకి తగిన ఫలితం రావాలి కదా. మాట వరసకు గ్రేటర్ పీఠం తమదేనని బీజేపీ చెప్పుకున్నా కూడా ఆ పార్టీ టార్గెట్ మాత్రం యాభై సీట్లు అంటున్నారు.

యాభై సీట్లు బీజేపీకి వస్తే అంతే తేడాలో టీయారెస్ కి సీట్లు తగ్గిపోతాయి. అపుడు మజ్లీస్ సాయం తీసుకుని గ్రేటర్ లో మేయర్ పీఠమెక్కాలి. అదే బీజేపీ కూడా కోరుకుంటోంది. ఆ రెండు పార్టీలను అలా అధికారికంగా కదిపితే బీజేపీ మార్క్ మసాలా రాజకీయానికి అవకాశం ఉంటుంది. గ్రేటర్ లో హిందూ కార్డు కూడా పదును ఎక్కుతుంది. అంతే కాదు తెలంగాణా మొత్తం ఇదే కార్డు తో రీసౌండ్ చేయడానికి వీలు అవుతుంది.

ఇక నాలుగు సీట్లు గత ఎన్నికల్లో తెచ్చుకున్న బీజేపీకి ఈసారి యాభై సీట్లు నిజంగా వస్తే టీయారెస్ కి అధి నిజమైన ఓటమే అవుతుంది. బీజేపీ వైపు నుంచి కూడా అది ఘన విజయమే అవుతుంది. మరి అన్ని లెక్కలూ వేసుకున్న కమలదళం కచ్చితంగా యాభైకి తగ్గకుండా సీట్లు వస్తాయని బలంగా నమ్ముతోంది. చూడాలి మరి బ్యాలెట్ బాక్సుల వెనక ఏముందో.

మరింత సమాచారం తెలుసుకోండి: