విరాట్‌ కోహ్లీ ఏమంటూ.. పెటర్నల్‌ లీవ్‌ తీసుకున్నాడోగానీ.. ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది. నిజానికి పాశ్చాత్య దేశాల్లో ఇదేం కొత్త విషయం కాదు. అక్కడ ఇలాంటి చట్టాలు కూడా ఉన్నాయి.
ఇల్లాలు నెల తప్పిందనగానే.. ఆ ఇంట్లో అందరి కంటే ఎక్కువగా సంతోషించేవాడు ఆమె భర్తే. ఎందుకంటే, తండ్రిగా తాను మరో గొప్ప బాధ్యతను నిర్వర్తించబోతున్నాననే అనుభూతి, తన ప్రతిరూపమొకటి ఈ ప్రపంచంలోకి రాబోతోందన్న ఆనందం.. అతనిలో అమితమైన ఆసక్తిని పెంచుతుంది. అయితే, భార్య కడుపుతో ఉండగా.. ఆమెకు తోడుగా ఇంటిపట్టునే ఉంటూ సాయమందించే వెసులుబాటు మాత్రం మనదేశంలో చాలా తక్కువనే చెప్పాలి.

ఇక్కడ ఉన్న చట్టాల ప్రకారం.. మహిళలకు మాత్రమే ఆరు నెలల పాటు మెటర్నరీ లీవ్స్‌ అందుబాటులో ఉంటాయి. కడుపుతో ఉన్న భార్యకు తోడుగా ఉండేందుకు.. భర్త కూడా పెటర్నల్‌ లీవ్‌ పెట్టొచ్చనే విషయం ఇప్పుడిప్పుడు బాగానే వినిపిస్తున్నా.. అదంతగా ఆచరణలో లేదు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. అందుకు మన సాంప్రదాయాలు, పద్ధతులు కూడా కారణంగా చెప్పొచ్చు.

సాధారణంగా మన దేశంలో.. మహిళకు పురుడు జరిగేది పుట్టింట్లోనే. అందునా నెల తప్పిందని తెలియగానే.. ఆమె దాదాపుగా పుట్టింటివారి సంరక్షణలోకి వెళ్లిపోతుందనే చెప్పాలి. సీమంతమనీ.. ఇతరత్రా కార్యక్రమాలనీ.. దాదాపుగా ప్రెగ్నెన్సీలో ఎక్కువ సమయం మెట్టినింటి కన్నా.. పుట్టింట్లోనే ఎక్కువగా గడుపుతారు స్త్రీలు. కొందరైతే మూడోనెల నిండగానే.. తమ బిడ్డను పుట్టింటికి తీసుకెళ్లిపోతారు.

డెలివరీ అయ్యి.. శిశువుకు బారసాల చేసేంత వరకు అన్ని బాధ్యతలూ పుట్టింటి వాళ్లే చూసుకుంటుంటారు. ఏ కొద్దిమందిలోనో తప్పితే.. దాదాపుగా అందరిళ్లలోనూ అనాదిగా ఇదే ఆనవాయితీ కొనసాగుతుంది. పేద, ధనిక అనే తేడాలుండవు.. కడుపుతో ఉన్న ఆడబిడ్డను ఇంటికి తీసుకొచ్చి పురుడుపోయాలని భావిస్తుంటారు. ఆ సంప్రదాయం వల్లే.. ఇక్కడ పెటర్నల్‌ లీవ్‌ అంశం పెద్దగా చర్చకు రాదనే అభిప్రాయమూ ఉంది. ఇలాంటి సంప్రదాయం వల్లే..  మనదేశంలో కడుపుతో ఉన్న ఆడవాళ్లకు కచ్చితంగా భర్త పక్కనే ఉండాల్సిన అవసరం లేదనే భావన ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: