హైదరాబాద్:  గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి. కౌంటింగ్ పైనే ఇప్పుడు పార్టీలన్నీ దృష్టి సారించాయి. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి? ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు? అనే లెక్కలే ఇప్పుడు అందరి మనసుల నిండా. ఈ క్రమంలో చాలా ఎగ్జిట్ పోల్స్‌లో కూడా అధికార టీఆర్ఎస్ పార్టీనే ఎక్కువ సీట్లు గెలుస్తుందని రావడం బీజేపీ నేతలకు కొంత కొరుకుడు పడని విషయమే. అయితే కౌంటింగ్ పూర్తయ్యే వరకూ ఓటమి అంగీకరించ కూడదని బీజేపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. తమ పార్టీకి చెందిన కౌంటింగ్ ఏజెంట్లతో గురువారం భేటీ అయ్యారు.

శుక్రవారం నాడు జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఏజెంట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కౌంటింగ్‌సౌ అనుమానాలు వస్తే ఏం చేయాలి? తదితర అంశాలపై సూచనలు ఇచ్చారు. ఈ సమావేశం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుడు శ్రీకాంతాచారి వర్థంతిని కూడా గుర్తు చేసుకున్న బీజేపీ నేతలు.. సమావేశంలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రీకాంతాచారికి నివాళులు అర్పించారు.

ఇదిలా ఉండగా, జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌కు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ రోజు సాయంత్రం వరకూ చాలా నెమ్మదిగా జరిగిన ఓటింగ్.. సాయంత్రం సమయానికి ఊహించని విధంగా పుంజుకుంది. దీంతో ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో  46.55 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని అధికారులు వెల్లడించారు.

ఈ ఎన్నికల్లో మొత్తం మీద  34,50.256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్ పూర్తవగానే ఫలితాలు కూడా శుక్రవారమే వెలువడతాయి. ఈ క్రమంలో మొదటగా మెహదీపట్నం డివిజన్ ఫలితం వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఫలితాలు వచ్చిన తర్వాత, కౌంటింగ్ సమయంలో ఎటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: