తలైవా వచ్చేస్తున్నాడు. లేటుగా అయినా లేటెస్ట్ గా వచ్చేస్తా అంటున్నాడు. తలైవా పార్టీ పెడతారా లేక మరెదైనా పార్టీలోకి చేరుతారా.. ఎవరికి సపోర్ట్ చేస్తారు.. అనే పలు ఊహాగానాలకు చెక్ పెడుతూ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు.

సూపర్‌ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై  సస్పెన్స్ వీడింది. జనవరిలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు తలైవా క్లారిటీ ఇచ్చేశారు. పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు డిసెంబరు 31న వెల్లడిస్తానని స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడును సమూలంగా మారుస్తామన్నారు.

తలైవా ప్రకటనతో తమకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారంటూ ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రజినీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తనకు మద్దతుగా నిలుస్తున్న వారందరికీ  రజినీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. సోమవారం రజనీ మక్కల్ మండ్రం ముఖ్య నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులతో రజనీకాంత్ భేటీ అయ్యారు. చెన్నై రాఘవేంద్ర కళ్యాణ మండపం వేదికగా ఈ సమావేశం జరిగింది. సమావేశం తర్వాత వీలైనంత త్వరగా క్లారిటీ ఇచ్చేస్తానని రజని చెప్పుకొచ్చారు. ఏళ్ల తరబడి నాన్చుతూ వచ్చిన రజనీ మొత్తానికి ఫ్యాన్స్‌ ఎదురు చూపులకు తెరదింపారు.

కోలీవుడ్ కి తమిళ పాలిటిక్స్ కి మంచి సంబంధం ఉంది. ఎంజీఆర్, కరుణ, జయలలిత నుంచి విజయ్ కాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్ వరకు అనేకమంది నటులు తమిళ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. అయితే, కరుణ, జయ మరణం తర్వాత తమిళనాట రాజకీయాలు అస్తవ్యస్తంగా మారాయి. దీంతో కమల్ హాసన్, రజని పొలిటికల్ ఎంట్రీ డిమాండ్లు పెరిగాయి. ఇప్పటికే కమల్  మక్కల్ నీది మయ్యం పేరిట పార్టీ స్థాపించగా.. 2017 డిసెంబరులో తన ఎంట్రీ ప్రకటించిన రజని ఇప్పుడు పార్టీ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: