ప్రపంచానికి కరోనా జన్యుక్రమం అందించిన చైనా.. అందరి కంటే ముందే వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైంది. అయితే ప్రపంచంలోనే తొలిసారిగా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చామని రష్యా ప్రకటించింది. కానీ రష్యా టీకా ఫలితాలపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. పుతిన్ కూతురికి మొదటి డోస్ ఇచ్చామని ఘనంగా ప్రకటించిన రష్యా... ఆ తర్వాత సాధారణ పౌరుల్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయన్న విమర్శలకు పెద్దగా స్పందించలేదు. పైగా తమ టీకా భేషుగ్గా ఉందని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంది. ఇక చైనా అయితే కరోనా వెలుగుచూసిన వుహాన్ నగరంలోనే టీకాలు మొదటగా ఇచ్చింది. కానీ అక్కడ పౌరుల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా.. అంతా బాగానే ఉందని ప్రచారం చేసింది. చైనాను నమ్మి ఆ వ్యాక్సిన్ కు అనుమతిచ్చిన బ్రెజిల్ లో .. ఫలితాలు బాగా రాలేదు. దీంతో చైనా వ్యాక్సిన్ కు అనుమతి వెనక్కి తీసుకుంటున్నట్టు బ్రెజిల్ సర్కారు ప్రకటించింది. అందరికంటే ముందే వ్యాక్సిన్ తయారుచేయాలనే కంగారులో.. సరైన విధివిధానాలు పాటించకుండా వ్యాక్సిన్ లు తయారుచేయడమే ప్రతికూల ఫలితాలకు కారణమని నిపుణులు తేల్చిచెబుతున్నారు.

ఏ వైరస్ కైనా వ్యాక్సిన్లు తయారుచేయడం అంత తేలిక కాదు. ఇప్పటివరకు ప్రపంచాన్ని పట్టి పీడించిన అనేక మహమ్మారులకు వ్యాక్సిన్లు తయారుచేయడానికి పదేళ్లు పట్టిన సందర్భాలున్నాయి. కానీ కరోనాకు మాత్రమే ప్రపంచంలో తొలిసారిగా చాలా వేగంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. వైరస్ వెలుగుచూసిన ఏడాదిలోనే వ్యాక్సిన్ ట్రయల్స్ మూడోదశకు చేరరడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇంత వేగంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తాయనుకోవడం అత్యాశే అవుతుందని నిపుణులు మొదటి నుంచీ చెబుతున్నారు.

అయితే వ్యాక్సిన్ తయారీ కంపెనీల ప్రకటనలు మాత్రం ప్రజల్ని గందరగోళంలో పడేస్తున్నాయి. 95 శాతం పనిచేస్తుందని ఒకరు, 99 శాతం సమర్థంగా ఉందని మరొకరు.. 70 శాతం ప్రభావం చూపుతోందని ఇంకొకరు.. ఎవరికి తోచినట్టు వారు చెబుతున్నారు. కానీ వీళ్లెవరూ తమ ప్రయోగ ఫలితాల్ని అధీకృత సంస్థలకు సమర్పించలేదు. నియంత్రణ సంస్థలు కూడా వీటిని నిర్థారించలేదు. కానీ వ్యాక్సిన్ కంపెనీలు మాత్రం పబ్లిసిటీ స్టంట్ పేరుతో తమ సంస్థల విలువ పెంచుకుంటున్నాయనే విమర్శలు లేకపోలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: