హైదరాబాద్‌: గ్రేటర్ ఎన్నికలూ ముగిశాయి. కౌంటింగ్ పైనే ఇప్పుడు పార్టీలన్నీ దృష్టి సారించాయి. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి? ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు? అనే లెక్కలే ఇప్పుడు అందరి మనసుల నిండా. ఈ క్రమంలో చాలా ఎగ్జిట్ పోల్స్‌లో కూడా అధికార టీఆర్ఎస్ పార్టీనే ఎక్కువ సీట్లు గెలుస్తుందని తేల్చాయి. ఈ క్రమంలో కౌంటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ టీఆర్ఎస్ నేతలు సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీకి చెందిన కౌంటింగ్ ఏజెంట్లతో గులాబీ నేతలు భేటీ అయ్యారు.

జీహెచ్‌ఎంసి ఎన్నికల ఫలితాలు శుక్రవారం తేలిపోతాయి. ఈ నేపధ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలన్నింటి వద్ద ఏసీపీ స్థాయి అధికారులు విధుల్లో ఉంటారని, ఆయా కౌంటింగ్ సెంటర్ల వద్ద పటిష్ట భద్రతను వాళ్లే ఏర్పాటు చేస్తారని అంజనీ కుమార్ చెప్పారు. అలాగే ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఓ పోలీసు అవుట్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను కూడా అంజనీ కుమార్ తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే నగర కమిషనరేట్ పరిధిలోని కౌంటింగ్ కేంద్రాల్లో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో మొత్తం 15 ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఈ తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఇతర విభాగాలకు చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు.

ఎన్నికల ఫలితాలపై నగర ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో ర్యాలీలు, తదితర కార్యక్రమాలపై నిషేధం విధించినట్లు చెప్పారు. ఈ ఆంక్షలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, చాలా ఎగ్జిట్ పోల్స్  ప్రకారం, గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఫలితాలు వెల్లడి అయ్యే వరకూ ఏ విషయమూ కచ్చితంగా చెప్పలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: