గ్రేటర్ ఫలితం తేడా వస్తే ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకంగా మారతాయి. అయితే ఇప్పుడు మేయర్ ఎన్నికకు ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లను పరిగణిస్తారా లేదా అనే విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటింగ్, జీహెచ్ఎంసీ చట్టంపై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ న్యాయశాఖకు నోటీసులు కూడా జారీ చేసింది.

జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్‌ 90(1)ను సవాలు చేస్తూ నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఇ.అనిల్ ‌కుమార్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో ఎక్స్‌అఫిషియో సభ్యులు పాల్గొనడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాదులు తెలిపారు. త్వరలో మేయర్‌ ఎన్నికలు జరుగుతాయని.. పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఆయన అభ్యర్థించగా ధర్మాసనం తిరస్కరించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ, న్యాయశాఖ కార్యదర్శి, ఎస్‌ఈసీ, జీహెచ్‌ఎంసీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 4వ తేదీకి వాయిదా వేసింది.

జీహెచ్ఎంసీలో 150మంది కార్పొరేటర్లు ఉండగా.. ప్రస్తుతానికి 45 మంది ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. మరో ఐదుగురికి ఎక్స్ అఫిషియోగా చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 45మంది ఎక్స్ అఫిషియోల్లో టీఆర్ఎస్ -31 ఎంఐఎం-10, బీజేపీ-2, కాంగ్రెస్-2 సభ్యులున్నారు. ప్రస్తుత జాబితా ప్రకారం 150 మంది కార్పొరేటర్లు, 45 మంది ఎక్స్‌ అఫిషియో సభ్యుల సంఖ్య కలిపితే మొత్తం సభ్యుల బలం గల పార్టీయే జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ స్థానాలను గెలిచే వీలుంటుంది. దీంతో ఒకవేళ కార్పొరేటర్ల స్థానాలు తగ్గినా, ఎక్స్ అఫిషియోల బలంతో టీఆర్ఎస్ కే మేయర్ పీఠం దక్కే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు మిగతా పార్టీలు ఎక్స్ అఫిషియో ఓట్లపై రగడ మొదలు పెట్టాయి. ఫలితాలు సమంగా వస్తే.. కోర్టు తీర్పే కీలకంగా మారుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: