గ్రేటర్ ఎన్నికల ఫలితాల తొలి ట్రెండ్స్ చూస్తూంటే బీజేపీ దూకుడు బాగానే కనిపిస్తోంది. ఆ పార్టీ ఏదైతే అనుకుందో అది జరిగేలా సీన్ ఉంది. తొలి లీడ్స్ కనుక చూసుకుంటే బీజేపీ చాలా చోట్ల ఆధిక్యంలో ఉంది. అది పోస్టల్ బ్యాలెట్ తో మొదలుకుని అన్ని చోట్లా బీజేపీ లీడ్ కనబరుతోంది. ఇదే ట్రెండ్ కనుక చివరి వరకూ బీజేపీ కొనసాగిస్తే మాత్రం కచ్చితంగా టీయారెస్ కి అది గట్టి దెబ్బ అవుతుంది.

గ్రేటర్ ఎన్నికల విషయంలో టీయారెస్ కి అనేక ప్రతికూల అంశాలు పనిచేశాయి అని కూడా అంటున్నారు. అన్నింటికీ మించి వరదల వల్ల జనం బాగా ఇబ్బంది పడిన కన్నీటి  నేపధ్యం ఉంది. మరి వారి ఆగ్రహమే టీయారెస్ కి శాపంగా, బీజేపీకి వరంగా మారిందా అన్న చర్చ అయితే ఉంది. అయితే తొలి ట్రెండ్స్ ని చూసి ఏదీ కచ్చితమైన అభిప్రాయానికి రాలేరు కానీ ట్రెండ్స్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం గులాబీ తోటలో గుబులు పుట్టడం తధ్యమని అంటున్నారు.

గ్రేటర్ లో నిజానికి బీజేపీకి ఆది నుంచి బలం ఉంది. టీయారెస్ పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడ చాలా పాకెట్స్ లో బీజేపీకి స్ట్రాంగ్ బేస్ ఉంది. అయితే ఇన్నాళ్ళూ ఆ చురుకుదనం పుట్టించే అగ్ర నాయకత్వం లేకపోవడం వల్లనే బీజేపీ అలా ఉందని, ఇపుడు సరైన సమయంలో గేర్ మార్చి స్పీడ్ పెంచడంతో సిటీలో కమలం హల్ చల్ చేసే అవకాశాలు కచ్చితంగా ఉంటాయని అంటున్నారు.

ఈసారి బీజేపీకి తక్కువలో తక్కువ పాతిక నుంచి ముప్పయి సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే ఆ మేరకు టీయారెస్ నష్టపోక తప్పదు. అపుడు టీయారెస్ సెంచరీ కల పూర్తిగా కల్లలుగా మారే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా తొలి ట్రెండ్స్ ని చూస్తే మాత్రం గ్రేటర్ ఓటర్ కొంత టీయారెస్ మీద వ్యతిరేకత చూపిస్తున్నాడు అని అర్ధమవుతోంది. మరి చూడాలి ఇదే ఫలితం తుదివరకూ కొనసాగుతుందా లేదా అన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: