తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల లెక్కింపు వేళ టీఆర్ఎస్ మాజీ ఎంపీ, కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. దీంతో ఆయన పార్టీ మార్పుపై సైతం ఊహాగానాలు మొదలయ్యాయి. టీఆర్‌ఎస్‌ని ఎదిరించే సత్తా బీజేపీకే ఉందంటూ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడుతున్న సమయంలో ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో ఉండి బీజేపీని వెనకేసుకురావడం చర్చనీయాంశమైంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారం సమయంలో పలువురు కాంగ్రెస్ నేతల మాదిరిగానే కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలపై ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా స్పందించారు. తనకు పార్టీ మారే ఆలోచన ఇప్పుడైతే ఏం లేదని స్పష్టం చేశారు.


తాజాగా, ఎన్నికల లెక్కింపు వేళ బీజేపీకి అనుకూలంగా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చూస్తే బీజేపీ సత్తా ఏంటో అర్థమవుతుందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఉద్యోగులు పూర్తిగా టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో స్పష్టమైందని, అంతేకాకుండా టీఆర్‌ఎస్‌ను ఎదిరించే సత్తా బీజేపీకే ఉందనే విషయం వారు కచ్చితంగా నమ్ముతున్నారని ఆయన చెప్పారు. అయితే ఓ కాంగ్రెస్ నేత మరో పార్టీని ప్రశంసించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కొండా విశ్వేశ్వరరెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారన్న వార్తలు వినిపిస్తున్న వేళ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇక సొంత పార్టీని కాకుండా వేరే పార్టీని పొగిడే విధంగా ట్వీట్ చేసినందుకు కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయమై ఎలా స్పందిస్తుందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: