హైదరాబాద్ : గ్రేటర్ పీఠం ఎవరిదన్న ఉత్కంఠకు నేటితో తెర పడనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఓటింగ్‌పై అన్ని పార్టీలూ ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఈ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. అయితే ముషీరాబాద్ నియోజక వర్గంలో మాత్రం కమలం పార్టీ విజయ ఢంకా మోగించింది. మొత్తం గ్రేటర్ ఎన్నికల్లో 46.60 శాతం పోలింగ్ నమోదు కాగా, ముషీరాబాద్ లో మాత్రం 48.8 శాతం పోలింగ్ నమోదవడం విశేషం. ఇక్కడ గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఎడ్ల భాగ్యలక్ష్మి ఘన విజయం సాధించింది.

ఈసారి మాత్రం ఇక్కడ ఫలితం తారుమారు అయింది. ముషీరాబాద్ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి ఎమ్ సుప్రియ గెలుపొందారు. ఇక్కడ మొత్తం నాలుగు పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. బీజేపీ తరఫున సుప్రియ, టీఆర్ఎస్ తరఫున ఎడ్ల భాగ్యలక్ష్మి, కాంగ్రెస్ నుంచి పట్నం స్వప్న బరిలో నిలవగా, స్వతంత్ర అభ్యర్థిగా వంగల వరూధిని పోటీ చేశారు. వీరిలో సుప్రియ విజయం సాధించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం మీద గ్రేటర్ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ ముందంజలో ఉన్నా కూడా.. చాలా ప్రాంతాల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది.

దుబ్బాక పరాజయం తర్వాత గ్రేటర్ ఎన్నికలపై అధికార టీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాయి. ఈ రెండు పార్టీలూ ఒకదాన్ని మించి మరొకటి ప్రచారం చేశాయి. టీఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, హరీష్ రావు తదితరులు ప్రచారం చేశారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రలు స్మృతి ఇరానీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు ప్రచారం నిర్వహించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. మరి ఫలితాలు పూర్తిగా వెలువడే సమయానికి ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారనేది తెలియాలంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: