హైదరాబాద్ : గ్రేటర్ పీఠం ఎవరిదన్న ఉత్కంఠకు నేటితో తెర పడనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఓటింగ్‌పై అన్ని పార్టీలూ ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఈ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. అయితే ఇప్పటి వరకూ వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినాయకత్వం కొన్ని పొరబాట్లు చేసినట్లు స్పష్టం అవుతోంది. ఈ గ్రేటర్ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తారనే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ నాయకులు 73 మంది సిట్టింగ్ నేతలకు అవకాశం ఇచ్చారు. కానీ ఈ నేతలు మాత్రం ఎన్నికల్లో తీవ్రంగా నిరాశ పరిచారు. మొత్తం 73 మందిలో 33 మంది సిట్టింగులు ఘోరమైన ఓటమినే మూట గట్టుకున్నారు.

దుబ్బాక పరాజయం తర్వాత గ్రేటర్ ఎన్నికలపై అధికార టీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాయి. ఈ రెండు పార్టీలూ ఒకదాన్ని మించి మరొకటి ప్రచారం చేశాయి. టీఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, హరీష్ రావు తదితరులు ప్రచారం చేశారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రలు స్మృతి ఇరానీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ కూడా కరోనా వ్యాక్సీన్ సాకు చూపి ఓ సారి హైదరాబాద్ సందర్శించి వెళ్లారు. దీంతో కాషాయ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. కచ్చితంగా మేయర్ పీఠం తమదేనంటూ ప్రకటనలు చేశారు. కానీ ఫలితాలు మాత్రం వేరేలా వచ్చాయి. అయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సారి కమలం పార్టీ చాలా మంచి ఫలితాలనే పొందిందని చెప్పొచ్చు.

చాలా ప్రాంతాల్లో అధికార టీఆర్ఎస్‌ కు బీజేపీ అభ్యర్థులు ముచ్చెమటలు పట్టించారు. దాదాపు విజయం అంచుల వరకూ వెళ్లి వెనుదిరిగారు. అంతేకాదు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు నమోదైన ఓట్ల శాతంలో పెద్దగా తేడా లేదు. అది కూడా బీజేపీ గెలిచిన స్థానాలన్నింటిలో దాదాపుగా టీఆర్ఎస్ సిట్టింగ్ నేతలో ఓటమి పాలవడం గమనార్హం. ఇంత మంది సిట్టింగులు ఓడిపోవడం టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని సమాచారం. మరి కొన్ని రోజుల్లో నాగార్జున సాగర్ నియోజక వర్గంలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో గ్రేటర్ లో సిట్టింగుల ఓటమిని గులాబీ పార్టీ సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నాగార్జున సాగర్ నియోజక వర్గంలో దుబ్బాక వంటి ఫలితం రిపీట్ కాకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలన్నీ గులాబీ పార్టీ తీసుకుంటుందని, వారు పోటీ పడే స్టైలే మారిపోయినా ఆశ్చర్యం లేదని చెప్తున్నారు. మరి అప్పుడు ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: