గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అర్ధ శతకం కొట్టి రికార్డులు సృష్టించింది. ఎక్కడో నాలుగు సీట్లు ఉన్న బీజేపీ ఇలా వీర విహారం చేయడం వెనక ఏ ఏ శక్తులు పనిచేశాయన్నది ఇపుడు ఆసక్తికరమైన చర్చగా ఉంది. పేరుకు నామమాత్రంగా తన పార్టీ నుంచి అభ్యర్ధులను నిలబెట్టిన టీడీపీ అసలు ఓట్లను మాత్రం జాగ్రత్తగా బీజేపీకి బదిలీ చేయడంలో సక్సెస్ అయింది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

టీయారెస్ ని దెబ్బ కొట్టేందుకు చంద్రబాబు వేసిన పధకంగా దీనిని అభివర్ణిస్తున్నారు. గతసారి 13 శాతం ఓట్లు ఒక సీటు తెచ్చుకున్న టీడీపీ ఆనాడు  సీమాంధ్ర నుంచి ఒక బలమైన సామాజికవర్గం ఉన్న ప్రాంతాల్లో దాదాపు ముప్పై సీట్లలో రెండవ స్థానంలో నిలిచింది. ఇపుడు ఆయా సీట్లలో సగానికి పైగా బీజేపీ గెలిచింది అంటే కచ్చితంగా అక్కడ ఆ సామాజికవర్గం ఓట్లు బీజేపీకి టర్న్ అయ్యాయనే అంచనా వేస్తున్నారు.

అంటే బీజేపీకి బలం ఇవ్వడం ద్వారా తెలంగాణాలో కేసీయార్ ని టీయారెస్ ని గట్టిగా  దెబ్బతీయడమే కాదు ఏపీలో కొత్త స్నేహాన్ని మళ్ళీ కలిపి జగన్ మీదకు దండెత్తడానికి బాబు ఈ మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు. రానున్న రోజుల్లో ఏపీలో కూడా బీజేపీతో జట్టు కట్టేందుకు చంద్రబాబు చూస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం అన్నది ఉండదు, అందువల్ల బీజేపీకి తెలంగాణాలో మద్దతు ఇవ్వడం ద్వారా ఏపీలో ఆ పార్టీతో కలిసేందుకు బాటలు వేసుకోవాలన్న బాబు ప్లాన సగం వరకూ సక్సెస్ అయింది.


మిగిలింది తిరుపతి ఉప ఎన్నిక తరువాత జరుగుతుంది అంటున్నారు. ఒక విధంగా బాబు మార్క్ పాలిటిక్స్ కి ఈ విధంగా తెరతీశారు అని కూడా అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు జగన్, ఇటు కేసీయార్ పాతుకుపోవడంతో బాబుకు నిద్ర పట్టడంలేదు. టీడీపీకి కూడా రాజకీయంగా ఇబ్బంది గా ఉంది. దాంతో ఇపుడు బీజేపీ కి తెర వెనక సాయం చేసి తాను ముందుకు రావాలనుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది.  చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: