గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల జోరు నేటి ఫలితాలతో ముగింపుకు వచ్చింది. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా, బీజేపీ గతంలో ఎన్నడూ లేనివిధంగా పుంజుకుని భారీగా సీట్లు సాధించింది. అయితే ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించినందుకు గానూ ఆ పార్టీ అగ్ర నేతలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌కు, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డిలకు అభినందనలు తెలుపుతున్నారు.


అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపును పురస్కరించుకుని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలువురికి అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ జాతీయ నాయకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అలాగే హైదరాబాద్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ గెలుపునకు పోరాడిన కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ విజయం బీజేపీ శ్రేణుల కష్టార్జితం అని తేల్చి చెప్పేశారు. అయితే అందరి పేర్లు ప్రస్తావించిన బండి సంజయ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు. గెలిచిన తర్వాత మీడియా సమావేశంలో గాని, తన ట్వీట్‌లో గాని పవన్ ప్రస్తావనే తీసుకురాలేదు. దీంతో బండి సంజయ్ తీరుపై జనసైనికులు రగిలిపోతున్నారు. జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల్లో తొలుత జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది. దాదాపు 60 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు కూడా వేశారు. ఇంతలోనే బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. దీంతో ఎన్నికల్లో పవన్, బీజేపీకి మద్దతు ప్రకటించారు. అలాగే నామినేషన్లు ఉపసంహరించుకోవాలని అభ్యర్థులను ఆదేశించారు.

భవిష్యత్తులోనూ తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పని చేస్తాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీంతో జనసైనికులు సైతం బీజేపీ గెలుపునకు పని చేశారు. సోషల్ మీడియాలో సైతం విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ, ఎన్నికల్లో గెలుపు తర్వాత బీజేపీ చీఫ్ బండి సంజయ్ పవన్ పేరు ప్రస్తావించకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ‘‘మీరు అడిగారని జన సేన వాళ్ళు నామినేషన్లు అన్ని విత్ డ్రా చేసుకున్నారు. కనీసం వాళ్ళకి కృతఘ్నత కూడా చెప్పవా? ఏమండీ సంజయ్ గారు. జన సేన కార్య కర్తలు చేసిన ప్రచారం మర్చిపోయారా? జనసేన నీ, పవన్ కళ్యాణ్ గారిని వాడుకుని, అవసరం తీరాక పక్కన పెడదాం అని చూస్తే, టీడీపీకి పట్టిన గతే మీకు పడుతుంది.’’ అని పలువురు జనసైనికులు సోషల్ మీడియా వేదికగా చీవాట్లు పెడుతున్నారు.







మరింత సమాచారం తెలుసుకోండి: