హైదరాబాద్: తెలంగాణ సరస్సులో కమలం విరబూసింది. మొన్న దుబ్బాకలో టీఆర్ఎస్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ కొట్టిన బీజేపీ ఇప్పుడు జీహెచ్ఎంసీలోనూ తన సత్తాను చాటింది. ఈసారి సెంచరీ కొట్టితీరుతామని చెప్పిన టీఆర్ఎస్ 55 సీట్లకు మాత్రమే పరిమితమైపోయింది. బీజేపీ నాలుగు సీట్ల నుంచి ఈసారి 48 స్థానాలకు ఎగబాకింది. మరోపక్క ఎంఐఎం తన పట్టును నిలుపుకుని 44 సీట్లను గెలుపొందింది.

ఎక్స్ అఫీసియో సభ్యులను పక్కన పెడితే.. మేయర్ పీఠం చేపట్టాలంటూ మ్యాజిక్ ఫిగర్ 76. ప్రస్తుతం ఏ ఒక్క పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను దాటకపోవడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కసరత్తును ప్రారంభించింది. శనివారం ఉదయం మంత్రులు కేటీఆర్, హరీష్ రావులత్ కేసీఆర్ భేటీ అయ్యారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాకపోవడానికి గల కారణాలపై కేసీఆర్ చర్చించారు. ఇక ఆఫ్ సెంచరీ దగ్గరకు చేరిన బీజేపీ సైతం భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చలు ప్రారంభించేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై జాతీయ నేతలతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం బండి సంజయ్ ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా బండి సంజయ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

గ్రేటర్ ఎన్నికల ఫలితాల వివరాలను బీజేపీ జాతీయ నేతలకు బండి సంజయ్ వివరించనున్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన కేంద్రమంత్రులు ప్రకాష్ జావడేకర్, స్మృతీ ఇరానీ సహా పలువును కలిసి కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడంపై పార్టీ అధిష్టానం ఇప్పటికే ఖుషీగా ఉంది. 2023 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తోంది. దానికి తగ్గట్టు ప్రణాళికలను రచించుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: