ఐటి మరియు పరిశ్రమల శాఖల పైన సమీక్ష నిర్వహించిన మంత్రి కే తారకరామారావు కీలక వ్యాఖ్యలు చేసారు.  ఐటీ పరిశ్రమను మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వేగంగా చర్యలు చేపడతామని అన్నారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలతో పాటు, తెలంగాణలోని ఇతర ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమ విస్తరణ ఉంటుంది అని ఆయన వెల్లడించారు. త్వరలోనే కొంపల్లిలో ఐటి పార్క్ కి శంకుస్థాపన చేస్తామని ఆయన పేర్కొన్నారు. వరంగల్ నగరానికి మరిన్ని ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు.

ఎల్లుండి ఖమ్మం ఐటీ టవర్ ప్రారంభోత్సవం చేస్తామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో మెరుగైన స్థానం కోసం కృషి చేయాలని అధికారులకు సూచనలు చేసారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో పాటు టి ఎస్ ఐఐ సి చైర్మన్ బాల మల్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఆలోచనల మేరకు ఐటీ పరిశ్రమలను నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించే కార్యక్రమాలపైన కేటిఆర్ సమీక్ష జరిపారు.

ఇప్పటికే మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ నగరాలకు ఐటీ పరిశ్రమలను విస్తరించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. దీంతో పాటు వరంగల్ నగరానికి సంబంధించి ఇప్పటికే పలు ఐటి కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని, రెండవ దశలో మరిన్ని ఐటీ కంపెనీలు వరంగల్ నగరంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు. అందుకు సంబంధించి అవసరమైన మౌలిక వసతులను, ఇతర సదుపాయాలకు సంబంధించి టి ఎస్ ఐ ఐ సి చేపడుతున్న కార్యాచరణ పైన ఆయన వివరాలు అడిగారు. ఒకటి రెండు ప్రముఖ కంపెనీలు త్వరలోనే వరంగల్ నగరానికి వస్తాయని, ఇందుకు సంబంధించి ఆయా కంపెనీలతో తెలంగాణ ఐటీ శాఖ చర్చలు నిర్వహిస్తుందని, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: