ఏపీలో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒంటికాలి మీద వెళ్ళే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మంత్రి కొడాలి నాని మాత్రమే. కొడాలి నాని ఏ మాత్రం మొహమాటం లేకుండా బాబుపై విమర్శలు గుప్పిస్తారు. చంద్రబాబు, జగన్ మీద, వైసీపీ మీద విష ప్రచారాన్ని తిప్పికొట్టడంలో భాగంగా నాని కాస్త ఘాటైన పదజాలంతోనే బాబుపై విరుచుకుపడతారు.

అవకాశం దొరికిన ప్రతిచోటా బాబుని ఓ ఆట ఆడేసుకుంటారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సైతం కొడాలి ఓ రేంజ్‌లో చంద్రబాబుపై ఘాటైన సెటైర్లు వేశారు. అయితే తాజాగా కొడాలికి బాబుని విమర్శించే మరో ఛాన్స్ దక్కింది. తాజాగా తెలంగాణలోని జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో 106 స్థానాల్లో పోటీ చేసి టీడీపీ ఒక్కచోట కూడా గెలవలేదు. ఇక ఇదే విషయంపై కొడాలి, బాబుపై విమర్శలు చేశారు. ఏపీలో సైతం టీడీపీకి డిపాజిట్లు రావని మాట్లాడారు. నెక్స్ట్ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని అన్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోతుందని చెప్పారు.

అయితే కొడాలి విమర్శలకు మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా కౌంటర్ ఇచ్చారు. మంత్రి కొడాలి నానివి గాలి మాటలని, మంత్రి పదవిని కాపాడుకోవడానికి ఊడిగం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫేక్ సీఎం గురించి కొడాలి నాని మాట్లాడుతున్నారని, జీహెచ్‌ఎంసీలో టీడీపీ 106 చోట్ల పోటీ చేసిందని, వైసీపీలా లాలూచీ పడలేదని అన్నారు. చంద్రబాబు బిక్షతో కొడాలి నాని ఎమ్మెల్యే అయ్యారన్నారు. ఆకాశం మీద ఉమ్మేస్తే నీ ముఖంపైనే పడుతుందని సూచించారు.

మామూలుగానే కొడాలి...చంద్రబాబుతో పాటు దేవినేని ఉమాని కలిపి విమర్శిస్తుంటారు. అయితే ఈ మధ్య ఉమాపై పెద్దగా విమర్శలు చేయడం లేదు. కానీ ఇప్పుడు కొడాలికి, ఉమా విమర్శించే ఛాన్స్ ఇచ్చారు. అసలు మామూలుగానే కొడాలి బాబుపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు. ఇలా కౌంటర్లు ఇస్తే, ఇంకా ఓ రేంజ్‌లో విరుచుకుపడటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: