హైదరాబాద్: దుబ్బాకలో పరాజయం కాంగ్రెస్ పార్టీ పతనానికి చివరి పరాకాష్ట. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో ఎలాగైనా గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటి, మళ్లీ పార్టీకి పునర్వైభవం తీసుకు రావాలని కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ ఆ ఆశ కూడా ఆవిరై పోయింది. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండంటే రెండే సీట్లు గెలిచింది. ఈ ఓటమికి బాధ్యత వహించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న అంశం ఆసక్తి కరంగా మారుతోంది. చాలా మంది ఈ పదవి కాంగ్రెస్ యువ నేత రేవంత్ రెడ్డికే దక్కబోతోందని అంటున్నారు. ఈ విషయం చర్చించేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరుగుతోంది.

అయితే తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో తాను కూడా ఉన్నానని, మిగతా వారితో పోల్చుకుంటే తానే ముందున్నానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. పీసీసీ చీఫ్ పదవి తనకు‌ ఇస్తే కాంగ్రెస్‌ శక్తులను ఏకతాటి పైకి తీసుకొని వస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా.. ప్రజల తరపున పోరాడుతామని, తద్వారా పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను కూడా ఆయన తప్పు బట్టారు. ప్రజలకు ఎల్‌ఆర్‌ఎస్ విధానం‌ భారంగా మారిందని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు చూసైనా ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలని, అలా చేస్తే టీఆర్ఎస్‌కు మేలు జరుగుతుందని సూచించారు.

అలాగే వరద సాయం అందని వారందరికీ మళ్లీ 10వేల రూపాయల సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. వరద సాయం గనుక ప్రజలకు అందకపోతే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని అధికార పార్టీని ఎంపీ కోమటిరెడ్డి హెచ్చరించారు. కాగా, గ్రేటర్ ఫలితాల నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసి వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తిని రేపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: