గ్రేటర్‌ ఎన్నికల్లో మరోసారి తన మార్క్‌ను చూపించింది మజ్లిస్‌ పార్టీ. మిగతా చోట్ల పార్టీల విజయాలు తారుమారైనా.. మజ్లిస్‌ ఇలాఖాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. పతంగ్ పార్టీ.. తమ స్థానాలను నిలబెట్టుకుంది. ఇప్పుడు మేయర్‌ ఎన్నికలో కీలకంగా మారింది.

గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల్లో.. తన పట్టు నిలుపుకొంది మజ్లిస్‌ పార్టీ. గతం కంటే తక్కువ స్థానాల్లోనే పోటీ చేసినా.. అప్పుడు గెలిచినన్ని స్థానాలనే గెలిచింది. మొత్తం 51 స్థానాల్లో బరిలో నిలిచిన ఆ పార్టీ.. 44 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది.

ఈ ఎన్నికల్లో పాతబస్తీ తన అడ్డా అని మరోసారి నిరూపించుకుంది ఎంఐఎం. ఇక్కడ పాగా వేయాలన్న అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీల ప్రయత్నాలను అడ్డుకోవడంలో సఫలమైంది. ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ ప్రాతినిథ్యం వహించే హైదరాబాద్‌ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వచ్చే పాతబస్తీలో.. 43 కార్పొరేటర్‌ డివిజన్లు ఉన్నాయి. 1959లో హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు జరిగిన ఉప ఎన్నికలో ఇద్దరు కార్పొరేటర్లతో మొదలైన మజ్లిస్‌ ప్రస్థానం.. 2016 ఎన్నికల నాటికి 44కు చేరింది.

ఈ సారి టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌, బీజేపీల మధ్య త్రిముఖ పోరు నడిచింది. మొత్తం 51 స్థానాల్లో పోటీ చేసిన మజ్లిస్‌.. 44 స్థానాలను గెలుచుకుని ఓల్డ్‌ సిటీలో తనకు ఎదురులేదని మరోసారి రుజువు చేసింది.

ఈ సారి జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ప్రధానంగా పాతబస్తీ కేంద్రంగానే నడిచాయి. పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంటూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. హోంమంత్రి అమిత్‌షా, బండి సంజయ్‌ వంటి నేతలు వ్యూహాత్మకంగా చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించడం పాతబస్తీలో రాజకీయ వేడిని పెంచింది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య మాటల తూటాలే పేలాయి. అయితే, ఈ రెండు పార్టీలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వ్యవహరించి సక్సెస్‌ అయ్యింది మజ్లిస్‌.

గ్రేటర్లో హంగ్‌ ఏర్పడంతో.. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో మజ్లిస్‌ కీలకం అయ్యే అవకాశం ఉంది. గతంలో 99 డివిజన్లు గెలిచిన టీఆర్‌ఎస్‌కు.. ఎవరి సాయం అవసరం లేకపోయింది. ఎక్స్‌అఫిషియో ఓట్ల అవసరం రాలేదు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ స్థానాలు భారీగా తగ్గడంతో మజ్లిస్‌ కీలకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంఐఎంకు 44 కార్పొరేటర్లతో పాటు.. అదనంగా 10మంది ఎక్స్‌అఫిషియో సభ్యులున్నారు. మరి మేయర్‌ ఎన్నికలో మజ్లిస్‌ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: