హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కానీ మ్యాజిక్ ఫిగర్ మాత్రం ఏ పార్టీకీ రాలేదు. దీంతో మేయర్ పీఠం ఎవరిదనే అంశంలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 55 స్థానాలు గెలుపొంది అతి పెద్ద పార్టీగా అవతరించింది. రెండో స్థానంలో 48 స్థానాలతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దుమ్ము లేపింది. మూడో స్థానంలో నిలిచిన ఎంఐఎం పార్టీకి 44 స్థానాలు గెలిచాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచి అవమానం మూట కట్టుకుంది. టీడీపీ అయితే కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదు.

గ్రేటర్ లో మొత్తం 150 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం మీద 46 శాతం పైగా పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ గ్రేటర్ ఎన్నికల్లో జరిగిన పోలింగ్‌ను పరిశీలిస్తే ఇది రికార్డు బ్రేక్ చేసిందనే చెప్పాలి. ఇంతలా జరిగిన ఎన్నికల్లో 149 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. ఒక్క స్థానంలో మాత్రం ఫలితం నిలిపి వేశారు. అయితే ఆయా స్థానాల్లో గెలిచిన వారిలో ఎంత మంది నేర చరిత్ర ఉన్న వారో తెలుసా? ఎంత మంది కార్పొరేటర్లపై నేర కేసులు ఉన్నాయో తెలియాలంటే ఇది చదవాల్సిందే.

గ్రేటర్ పరిధిలో పోటీ చేసిన మూడు ప్రధాన పార్టీల్లో కలిపి మొత్తం 25 మంది అభ్యర్థులకు నేర చరిత్ర ఉందట. ఈ విషయాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది. ఈ నేర చరితుల జాబితాను శనివారం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, బీజేపీ అభ్యర్థుల్లో 10 మంది, అధికార టీఆర్ఎస్ క్యాండిడేట్లలో 8 మంది, ఎంఐఎం అభ్యర్థుల్లో 7గురు నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్లట. ఈ జాబితాపై ఆయా పార్టీలు ఇప్పటి వరకూ ఎటువంటి కామెంట్లూ చేయలేదు. ఏదేమైనా మొత్తం పాతిక మంది నేర చరిత్ర ఉన్న వాళ్లు ఎన్నికల్లో గెలుపొందటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: