హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కానీ మ్యాజిక్ ఫిగర్ మాత్రం ఏ పార్టీకీ రాలేదు. దీంతో మేయర్ పీఠం ఎవరిదనే అంశంలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 55 స్థానాలు గెలుపొంది అతి పెద్ద పార్టీగా అవతరించింది. రెండో స్థానంలో 48 స్థానాలతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దుమ్ము లేపింది. మూడో స్థానంలో నిలిచిన ఎంఐఎం పార్టీకి 44 స్థానాలు గెలిచాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచి అవమానం మూట కట్టుకుంది. టీడీపీ అయితే కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదు.

ఈ నేపథ్యంలో బీజేపీ విజయంపై కాంగ్రెస్ సీనియర్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్.. గ్రేటర్ లో అయినా ఎక్కువ స్థానాలు గెెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావించింది. కానీ ప్రజలు మాత్రం ఈ ఆశలకు గండి కొట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ మీడియాతో శనివారం ముచ్చటించారు. ఈ క్రమంలో దుబ్బాకలో విజయం సాధించి, గ్రేటర్ లో కూడా బలాన్ని చూపించుకున్న బీజేపీపై ఆయన మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇలా వరుసగా ఓటములు చవి చూడటం బాధాకరమే అని మధుయాష్కీ ఆవేదన వ్యక్తం చేశారు.

తమ పార్టీ, అలాగే నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని, ఇలా చేయాల్సిన అవసరం కూడా చాలా ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని తామే ఇచ్చినా ఇక్కడ ఎందుకు ఓడిపోయాం? అనే కారణాల మీద సమీక్ష చేసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ విజయం ఏమీ గొప్పది కాదని,  మతం మత్తు ఎక్కించి బీజేపీ ఓట్లు దండుకుందని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుని ఎన్నికపై సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఎవరికి అధ్యక్ష పదవి ఇచ్చిన అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: