ఇంత కాలం శత్రువులు అనుకున్న వాళ్లే అక్కున చేర్చుకున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో అధికార పార్టీ పరువు నిలబెట్టారు. తెలంగాణ వాసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ పట్టంకట్టగా, సీమాంధ్రులు అధికంగా ఉన్న చోట టీఆర్ఎస్ కు జైకొట్టారు. ఇంతకీ సీమాంధ్రులు టీఆర్ఎస్ కు మద్దతు పలకడానికి కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు.

తెలంగాణవాదులు ఓడించారు, ఆంధ్రావాళ్లు గెలిపించారు. టీఆర్‌ఎస్‌ అంటే సీమాంధ్రులకు వ్యతిరేకమని... హైదరాబాద్‌లోని సీమాంధ్రులు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటేస్తారనే భ్రమల్లో చాలామంది ఉంటారు. కానీ ఈ సారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాత్రం తెలంగాణ వాసులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బీజేపీకి ఓట్లు పడితే... సీమాంధ్రులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఓటేయడం... అందరినీ ఆశ్చర్యపడేలా చేసింది.  

హైదరాబాద్‌లోని సీమాంధ్రులు... బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసి టీఆర్‌ఎస్‌కు కచ్చితమైన ఫలితాన్ని ఇచ్చారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, వెంగళరావునగర్‌, శ్రీనగర్‌ కాలనీ, బంజారా హిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ ఊహించినదాని కంటే ఎక్కువ సీట్లు కొట్టగలిగింది. 55 సీట్లతో బోర్లాపడిన టీఆర్‌ఎస్‌కి... ఆ మాత్రమైనా సీట్లు వచ్చాయంటే, దానికి కారణం.. ఈ ప్రాంతాలే.
శేరిలింగంపల్లిలో 10 స్థానాలు ఉంటే... టీఆర్‌ఎస్‌కి 9, బీజేపీకి ఒకటి వచ్చాయి. దీనినిబట్టి... హైదరాబాద్‌ సీమాంధ్రులు... టీఆర్‌ఎస్‌ని ఎంతగా అభిమానిస్తున్నారో.. ఎంతగా బీజేపీని ద్వేషిస్తున్నారో అర్ధమవుతుంది.

తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఉపాధి, ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వాళ్లు నివసించే ప్రాంతాల్లో బీజేపీ గెలిచింది. ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌, ఆర్కేపురం డివిజన్లలో కమలం వికసించింది. ముఖ్యంగా ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. తెలంగాణవాదులు అధికంగా ఉండే ప్రాంతాల్లోనే తమ అభ్యర్థులు ఓటమిపాల్వడం టీఆర్‌ఎస్‌కు మింగుడుపడని విషయమే.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఉద్యమానికి పెద్దగా సహకరించని ప్రాంతాల్లో ఈ సారి కారు దూసుకెళ్లింది. ఆంధ్ర ప్రాంతం వాళ్లు ఎక్కువగా నివసించే జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, సంజీవరెడ్డినగర్‌, బాలానగర్‌, జగద్గిరిగుట్ట, గాజులరామారం ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. కూకట్‌పల్లి సర్కిల్లో ఆరు డివిజన్లలో గులాబీ జెండా రెపరెపలాడింది. కుత్బుల్లాపూర్‌ అసెంబ్లీ పరిధిలో 7 డివిజన్లుంటే ఆరింట టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం బట్టి చూస్తుంటే... అధికార పార్టీకి సీమాంధ్రుల నుంచి ఏ స్థాయిలో మద్దతు లభించిందో అర్థం చేసుకోవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: