హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కానీ మ్యాజిక్ ఫిగర్ మాత్రం ఏ పార్టీకీ రాలేదు. దీంతో మేయర్ పీఠం ఎవరిదనే అంశంలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 55 స్థానాలు గెలుపొంది అతి పెద్ద పార్టీగా అవతరించింది. రెండో స్థానంలో 48 స్థానాలతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దుమ్ము లేపింది. మూడో స్థానంలో నిలిచిన ఎంఐఎం పార్టీకి 44 స్థానాలు గెలిచాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచి అవమానం మూట కట్టుకుంది. టీడీపీ అయితే కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదు.

గ్రేటర్ ఎన్నికల ఓటమికి బాధ్యత వహించిన తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌లో ప్రస్తుతం సీనియర్ నేతలంతా పీసీసీ చీఫ్ పదవి కోసం పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పీసీసీ పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. త్వరలోనే ఆయన ఢిల్లీ వెళ్లబోతున్నారని, అక్కడ పార్టీ పెద్దలను కలుస్తారని సమాచారం.

ఈ వార్తలపై జగ్గారెడ్డి కూడా స్పందించారు. గ్రేటర్ ఎన్నికల ఫలితంపై కూడా ఆయన మాట్లాడారు. గ్రేటర్ ఫలితాల్లో బీజేపీ గెలిచిన 48 సీట్లు.. భాగ్యలక్ష్మి అమ్మవారి గెలుపని జగ్గారెడ్డి చెప్పారు. జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌‌కు రెండు సీట్లే రావడంపై కూడా ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి పార్టీ నేతలందరూ కారణమేనని ఆయన స్పష్టం చేశారు. ఇంత కాలం పీసీసీని ముందుకు నడిపించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి విలువ ఇప్పుడు ఎవరికీ తెలియక పోయినా..  భవిష్యత్‌లో మాత్రం ఆయన విలువ అందరికీ తెలుస్తుందని చెప్పారు.

అలాగే పీసీసీ చీఫ్‌ పదవి కోసం తాను చాాలా సీరియస్‌గా ప్రయత్నిస్తున్నట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. తాను ఢిల్లీ వెళ్లబోతున్నట్లు వస్తున్న వార్తలు వాస్తవాలేనని, త్వరలోనే ఢిల్లీ వెళ్లి రాహుల్‌ గాంధీని కలుస్తానని కుండ బద్దలు కొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: