హైదరాబాద్: ఉత్కంఠ భరితంగా సాగిన గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు ఎవరూ ఊహించని రీతిలో వచ్చాయి. అయితే ఈ ఎన్నికలు, ఫలితాల సరళిపై అనుమానాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే గ్రేటర్ ఎన్నికలు, ఫలితాలకు సంబంధించిన సమాచారం కావాలంటూ ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) కింద దరఖాస్తు చేశారు.

గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, ఎంఐఎంలు రిగ్గింగ్ చేసినట్లు వదంతులు వినిపిస్తున్నాయని శ్రవణ్ అన్నారు. పోలింగ్ చివరి నిమిషం వరకూ 38 శాతం మాత్రమే ఓటింగ్ జరిగినట్లు సమాచారం వచ్చిందని, అయితే చివరి గంట గడిచిన తర్వాత మాత్రం 50శాతం పోలింగ్ జరిగినట్లు ఎలక్షన్ కమీషన్ ప్రకటించిందని శ్రవణ్ గుర్తు చేశారు. ఈ ప్రకటనలు కూడా అనుమానాలకు తావిస్తున్నాయని చెప్పారు. ఈ నేపధ్యంలోనే తాను సమాచారం హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా గ్రేటర్ ఎన్నికల పూర్తి సమాచారం కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు.

జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా 150 డివిజన్లలో పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ బూత్‌లలో పోలింగ్ మొదలైన సమయం నుంచి చివరి వరకూ సిసిటీవీ పుటేజీలను, వెబ్ కాస్టింగ్ రికార్డింగ్ వీడియో డేటాతో పాటు పూర్తి సమాచారం అందజేయాలని  శ్రవణ్ దరఖాస్తు చేశారు. అదే విధంగా ఎన్నికల్లో భాగంగా మొత్తం పోలైన ఓట్ల వివరాలు, అలాగే బ్యాలెట్ పేపర్ లపై స్వస్తిక్ కాకుండా వేరే ఇతర గుర్తును పోలిన ఓట్ల వివరాలు కూడా ఇవ్వాలని ఆయన తన దరఖాస్తులో పేర్కొన్నారు  ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య చాలా గట్టి పోటీ నెలకొంది. అయితే ఈ రెండు పార్టీల వేడిలో కాంగ్రెస్ కొట్టుకు పోయింది. కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఎన్నికల సరళిపై శ్రవణ్ అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: