2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున చాలామంది ఎమ్మెల్యేలు భారీ భారీ మెజారిటీలతో గెలిచిన విషయం తెలిసిందే. జగన్ పులివెందుల నుంచి దాదాపు 90 వేల పైనే మెజారిటీతో గెలిచారు. ఇంకా ఆయన తర్వాత పలువురు ఎమ్మెల్యేలు మంచి మెజారిటీలతో గెలిచారు. ఇక టీడీపీలో మంచి మెజారిటీలతో గెలిచింది మాత్రం, చంద్రబాబు, ఆదిరెడ్డి భవానిలే. బాబు కుప్పం నుంచి, భవాని రాజమండ్రి సిటీ నుంచి దాదాపు 30 వేల పైనే మెజారిటీలతో గెలిచారు.

అయితే అధికారంలోకి వచ్చాక బలంగా ఉన్న టీడీపీ నేతలకు చెక్ పెట్టే విధంగా వైసీపీ ముందుకెళుతుంది. ఈ క్రమంలోనే రాజమండ్రి సిటీలో ఉన్న ఆదిరెడ్డి ఫ్యామిలీకి చెక్ పెట్టాలని వైసీపీ చూస్తోంది. భవాని, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు సోదరి అని అందరికీ తెలిసిందే. ఇటు ఆదిరెడ్డి ఫ్యామిలీ, అటు కింజరాపు ఫ్యామిలీల సపోర్ట్ ఉండటంతో భవానికి మంచి మెజారిటీ వచ్చింది. అయితే పేరుకు భవాని ఎమ్మెల్యే అయినా, పెత్తనం మాత్రం ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్‌ది.  

శ్రీనివాస్ అనధికార ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో పనులు ఈయనే చేస్తున్నారు. అలాగే అధికార పార్టీపై దూకుడుగా వెళుతున్నారు. నియోజకవర్గంలో సమస్యలని పరిష్కరించడంలో ముందున్నారు. భవానికి పెద్దగా రాజకీయాలు తెలియకపోవడంతోనే శ్రీనివాస్ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. అందుకే ఇంకా రాజమండ్రిలో టీడీపీ బలం తగ్గలేదు.

కానీ శ్రీనివాస్‌కు ఏదొరకంగా చెక్ పెట్టాలని వైసీపీ చూస్తుంది. ఓ వైపు మాజీ ఎమ్మెల్యే రౌతుల సూర్యప్రకాశరావు, మరో వైపు రాజమండ్రి నగర కో-ఆర్డినేటర్‌ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యంలు వైసీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లోపు నగరంలో ఆదిరెడ్డి ఫ్యామిలీని వీక్ చేసి, వైసీపీని ఎలాగైనా గెలిపించుకోవాలని చూస్తున్నారు. అందుకే టీడీపీ కేడర్‌ని తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీకి ఓటు వేసినవారికి సైతం ప్రభుత్వ పథకాలు, ఇళ్ల పట్టాలు అందేలా చూస్తున్నారు. దీని వల్ల టీడీపీ కేడర్ వైసీపీ వైపుకు వస్తే రామ్మోహన్ బావకు చెక్ పడిపోతుంది. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో రాజమండ్రి సిటీ రాజకీయం ఎలా ఉంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: