జైపూర్: ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం, సమాజలో వారి నైతికతను, హుందాతనాన్ని కాపాడేందుకు 1989లో రూపొందించిన చట్టమే ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం. ఈ చట్టం ఎస్సీ, ఎస్టీల హక్కులను రక్షిస్తుంది. సమాజంలో వారికి కూడా సమాన హక్కును కల్పిస్తుంది. ఎస్సీ, ఎస్టీలతో ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా, వారితో దుర్మార్గంగా వ్యవహరించినా వారిని కఠిన శిక్షలు విధించడం జరుగుతుంది. అంతేకాదు ఈ చట్టం ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలను వారి కులం పేరుతో దూషించడం, తక్కువ చేసి మాట్లాడడం కూడా శిక్షార్హమే. అణచివేతకు, దారుణాలకు గురైన ఎస్సీ, ఎస్టీల్లో ఆత్మ గౌరవాన్ని పెంచడం, వారికి తగిన పునరావాసం కల్పించడం గురించి కూడా ఈ చట్టంలో పొందుపరిచారు. ఒకరంకంగా చెబితే ఈ చట్టం ఎస్సీ, ఎస్టీలకు ఓ వరం వంటిది. కానీ ఇటీవలి కాలంలో ఈ చట్టం సక్రమంగా కంటే అక్రమంగా వినియోగించడమే ఎక్కువైందట. ఈ విషయాన్ని రాజస్థాన్ పోలీసులు వెల్లడించారు.

ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదవుతున్న మొత్తం కేసుల్లో దాదాపు సగం వరకు కేసులు అసత్యాలేని అక్కడి పోలీసులు చెబుతున్నారు. 2020లో రాజస్తాన్‌లో ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులకు సంబంధించిన వివరాలను ఆ రాష్ట్ర పోలీసులు తాజాగా విడుదల చేశారు. ఇందులో 40 శాతం తప్పుడు కేసులేనని తేల్చి చెప్పారు. మహిళా అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసుల్లో కూడా ఇదే స్థాయిలో తప్పుడు కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. 39.55 శాతం కేసులు సరైనవి కావని, ఉద్దేశపూర్వకంగానే అవతలి వారిపై తప్పుగా నమోదు చేస్తున్న కేసులని రాజస్తాన్ పోలీసులు తెలిపారు.

రాజస్తాన్ ప్రభుత్వం విడుదల చేసిన 2020 సమాచారం ప్రకారం.. 2020వ సంవత్సరంలో మొత్తం 7,017 కేసులు ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదయ్యాయి. ఈ సంఖ్య 2019తో పోల్చుకుంటే చాలా పెరిగిందట. ఇందులో ఎస్సీలు నమోదు చేస్తున్న కేసులు 3 శాతం పెరిగాయని, ఎస్టీలు నమోదు చేస్తున్న కేసులు 5 శాతం పెరిగాయని పేర్కొన్నారు. ఇక మొత్తం కేసుల్లో ఎస్సీల ద్వారా నమోదైన కేసుల్లో 42.17 శాతం కేసులు, ఎస్టీలు నమోదు చేసిన వాటిలో 40.04 శాతం కేసులు తప్పుగా అవతలివారిపై కక్ష సాధింపు కోసం కావాలని నమోదు చేసినవని పోలీసులు తేల్చి చెప్పారు. అంటే పోలీసులు చెబుతున్నదాని ప్రకారం మొత్తం 7వేల కేసుల్లో దాదాపు 3వేలకు పైగా కేసులు ఫేక్ అన్నమాట. ఇలాంటి సమయంలో ఈ చట్టం విశ్వనీయతపైనే అనుమానాలు తలెత్తుతాయి. మరి దీనిపై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: